దీపారాధనలో తెలియకుండా చేసే పొరపాట్లివే

Update: 2019-08-23 08:20 GMT

స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు. అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించారాదు. ఒకవత్తి దీపాన్ని చేయరాదు. ఏక వత్తి శవం వద్ద వెలిగిస్తారు. దీపాన్ని అగరవత్తి తో వెలిగించాలి. దీపారాధన మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి. విష్ణువుకు కుడివైపు ఉంచాలి. ఎదురుగా దీపాన్ని ఉంచరాదు. దీపం కొండెక్కితే "ఓమ్ నమః శివాయ " అని 108 సార్లు జపించి దీపం వెలిగించాలి.

పంచలోహాలు, వెండి, మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం శ్రేయష్కరం. అయితే నిత్యపూజకు మట్టి ప్రమిదలు వాడటం మంచిది కాదు. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరం. సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మి దేవిని స్మరించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి. తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది.

అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరిసంపదలు, విద్య, వివాహం వంటివి సిద్ధిస్తాయి. దక్షిణంవైపు దీపారాధన చేయరాదు. దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, దుఖం, బాధ కలుగుతాయి. దీపారాధనకు తామరకాడతో చేసిన వత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. తెల్లటి కొత్త వస్ర్తం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టి తర్వాత ఆ వస్త్రాన్ని వత్తులుగా చేసి దీపారాధన చేసినా శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేసి వెలిగిస్తే ఈతి భాదలు తొలగించటకు మంచిది.

దీపం వెలిగించడానికి ఏ నూనె వాడాలి అనే దానిపై చాలా మంది అయోమయం చెందుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితులలో కూడా పల్లి (వేరుశనగ ) నూనెతో దీపారాధన చేయరాదు. దీపారాధనకు ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది. లేదంటే నువ్వుల నూనె వాడినా శ్రేష్టమే. దీపం వెలిగించడానికి ఆముదం ఉపయోగిస్తే దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగుతుంది. విప్ప, వేప నూనెలు, ఆవు నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. నల్ల నువ్వుల నూనెతో శనీశ్వరునికి దీపారాధన శుభము. అదే ఆవు నెయ్యి, విప్ప, వేప, ఆముదం, కొబ్బరినూనెల మిశ్రమంతో 41 రోజులు దీపం వెలిగిస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.


Tags:    

Similar News