జీవి శ్వాస ఆడక, నిద్రావస్థలో ఉంటాడు... దాన్ని తాత్కాలిక మరణమంటారు. ఈ పరిస్థితిని చూసిన డాక్టర్లు కూడా చనిపోయాడనే చెబుతారు. కానీ ఇది కరెక్ట్ కాదట. తాత్కాలిక మరణం పొందినప్పుడు శరీరం చెడిపోదట. ఆత్మ శక్తి, శరీరమంతా ప్రసరించకుండా.. కేవలం తల మధ్యభాగంలో ఉన్న బ్రహ్మనాడీలో ఆగిపోతుందట. అదే సమయంలో ఆ జీవిలోని కొన్ని అవయవాలు కూడా అంత తేలిగ్గా చచ్చుబడిపోవని ఆధారాలతో సహా రుజువు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.
మరణ స్థితి గురించిన ప్రస్తావన భగవద్గీతలో కూడా ఉంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన బ్రహ్మయోగ స్థితి ఇంచుమించు తాత్కాలిక మరణంలాంటిదే. బ్రహ్మయోగంలో, బాహ్య జ్ఞానేంద్రియాలు పనిచేయవు, శ్వాస మాత్రం ఆగిపోతుంది. గుండె ఆగిపోతుంది. ఇలాంటి లక్షణాలే.. తాత్కాలిక మరణంలోనూ కన్పిస్తాయ్. అయితే.. బ్రహ్మయోగంలో జీవికి అంతా తెలుస్తూ ఉంటే.. తాత్కాలిక మరణంలో జీవి మరుపుతో ఉంటాడు. ఈ రెండు స్థితుల్లోనూ జీవిని తిరిగి ప్రాణంతో లేపవచ్చట.
ఒక రకంగా సైన్స్ భాషలో దీన్ని కోమాగా చెప్పొచ్చు. ఇందులో ఎన్ని రకాల కోమాలున్నా.... అన్నింటిలోనూ ఒక సాధారణ లక్షణం కన్పిస్తుంది. మనిషి శరీరం స్పందించదు. మెదడు మాత్రమే కొద్దిగా పనిచేస్తూ... కళ్లతో హావభావాలను పలికిస్తుంది. ఇలా కొన్ని రోజులుండొచ్చు, కొన్ని సంవత్సరాలుండొచ్చు. ఇలా ఎన్నేళ్లు ఉండాలా అన్నది.. ఆ మనిషి మెదడుపై ఆధారపడిఉంటుంది. మనిషి మెదడు చూడ్డానికి ఒక వింత పదార్థంలా కన్పిస్తుంది. కానీ అదొక మార్మిక యంత్రం. విజ్ఞానశాస్త్రానికి కూడా అంతుపట్టని సాంకేతికాంశాలు మెదడులో ఉన్నాయి. విద్యుత్, రసాయనికచర్యలతో అత్యద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలోని మొత్తం అవయవాలతో అనుసంధానించి ఉంటుంది. అన్నింటికన్నా మించి అన్ని అవయవాలకు ఆదేశాలను అందిస్తుంది. వ్యూహాలను అమలుపరుస్తుంది. సకల వ్యవస్థల పనితీరుకు అధినేతగా వ్యవహరిస్తుంది మెదడు.
ఇంతటి కీలకభాగం ఒక్కసారిగా స్థంభిస్తే.. పరిస్థితి ఏంటి. ఊపిరి పీల్చుకోవడంతో సహా అత్యంత ముఖ్యమైన కార్యకలాపాలన్నీ ఆగిపోతాయి. కండరాలు పనిచేయవు. ఈ స్థితినే బ్రెయిన్‌డెడ్ అంటారు. అంటే మనిషి పూర్తిగా చనిపోయాడని అర్థం. గుండె క్రమబద్ధంగా కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు కార్డియాక్ అరెస్ట్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భాల్లో నాడి అందదు, శ్వాస క్రియ ఉండదు, కళ్లలో కార్నియా ప్రతిబింబించదు. దీన్నే క్లినికల్లీ డెడ్ అంటారు.
గుండె కొట్టుకోవడం ఆగిపోతే... మెదడు పనిచేయకపోతే... శరీరం స్పందించకుంటే.. మనిషి చచ్చిపోయాడని అంటాం. అంటే ఈ భూమ్మీద ఆ వ్యక్తి రుణం తీరిపోయిందని ఏడుస్తుంటాం. మనిషి చనిపోయినా... మన బాడీలోని జీవం మాత్రం ఆగిపోదంటున్నారు శాస్త్రవేత్తలు. మరణంతో శరీరంలోని అవయవాలన్నీ పనిచేయకపోయినా కొన్ని మాత్రం కొన్ని రోజుల పాటు అలా తమ విధిని నిర్వర్తిస్తూనే ఉంటాయని గుర్తించారు.
ఎలుకలు, జీబ్రాఫిష్‌ల జన్యుక్రమానికి, మనిషికి ఎన్నో పోలికలు ఉన్నప్పటికీ మరిన్ని పరిశోధనల ద్వారా మానవుడు మరణం తరువాత కూడా కొన్ని జన్యువులు చైతన్యంతో ఉంటాయన్న నిజం మాత్రం బయట ప్రపంచానికి ఎప్పుడో తెలిసినా... ఇప్పుడు ఆధారాలతో సహా నిరూపితమైంది.