శ్రావణపౌర్ణమి నాడే రాఖీ పౌర్ణిమ ఎందుకు జరుపుకుంటారో తెలుసా!!

Update: 2019-08-10 06:37 GMT

రాఖీపౌర్ణిమ , జంధ్యాలపౌర్ణమిగా పిలుచుకునే శ్రావణ పౌర్ణిమ సోదర సోదరీమణుల ఆత్మీయతకూ, అనురాగానికీ , ప్రేమకు ప్రతిరూపం. భారతీయ కుటుంబ బాంధవ్యాల్లో మధురమైన గుర్తు ఈ పండగ. వ్యక్తుల మధ్య విడదీయరాని బంధాన్ని ఈ రాఖీ బంధం సృష్టిస్తుంది. సోదర ప్రేమకు చిహ్నంగా ఈ రక్షాబంధనం ప్రాచుర్యం పొందింది. అసలు సంవత్సరంలో ఇన్ని రోజులుండగా ఈ శ్రావణపౌర్ణిమ రోజునే రాఖీపండుగను ఎందుకు జరుపుకుంటున్నామో చూద్దాం.

జ్యోతిష దృక్కోణంలో చూసినపుడు అమావాస్య జ్ఞాన సిద్ధికి ప్రతీక అయితే పౌర్ణిమ కార్యసిద్ధికి ప్రతీక. ర్ణిమ రోజున ఉండే నక్షత్రాన్ని బట్టి ఆ పౌర్ణమి ఉండే మాసానికి పేరు ఉంటుంది. అలాగే పౌర్ణమి రోజు శ్రవణం నక్షత్రం ఉండే మాసం శ్రావణ మాసం. శ్రవణం కార్యసాధకం అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. శ్రవణానికి అధిదేవత విష్ణువు. సృష్టి కారకుడు బ్రహ్మ , లయ కారకుడు శివుడు అయితే స్థితి కారకుడై రక్షించేది విష్ణువు. కాబట్టే అలాంటి జగత్ రక్షకుడయిన విష్ణువు అధిదేవత గా గల కార్యసిద్ధిని కలిగించే శ్రవణా నక్షత్రం ఉండే శ్రావణపౌర్ణిమ రోజున మనం రాఖీపౌర్ణిమ జరుపుకుంటాం.

శ్రావణ పౌర్ణమి నాడు సోదరీమణులు ఓ పళ్లెంలో రాఖీలు,పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు వంటి ద్రవ్యాలను ఉంచి , ముందుగా కులదైవాన్ని ప్రార్థించి, ఏదైనా తీపి ప్రసాదాన్ని నివేదించాలి. తర్వాత దేవునిముందు రాఖీలను పూజించి ,అనంతరం ఈ ప్రసాదాన్ని మరియు రాఖీలను ఉంచిన పళ్లెమును తీసుకుని వచ్చి, అన్నదమ్ములకు తిలకం దిద్ది, తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి. ఆ రోజున కట్టే రాఖీలకు విష్ణుశక్తిని ఆవాహన చేసే ఈ క్రింది మంత్రాలను చదువుతూ సోదరీమణులు తమతమ సోదరుల కుడి చేతి మణికట్టుకు రక్షను కట్టాలి.

1) యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః|

తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల ||

2) వనమాలి గదీ శార్ఙ్గీ శంఖీ చక్రీ చ నందకీ। శ్రీమన్నారాయణో విష్ణు ర్వాసుదేవోభిరక్షితు।।

ఇలా రాఖీ కట్టాక భగవంతునికి నివేదించిన తీపి ప్రసాదాన్ని సోదరులకు తిపించాలి. ఆ తర్వాత సోదరులు అక్షింతలు వేసి చెల్లెలైతే దీవిస్తారు. అక్కలైతే నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు. 

Tags:    

Similar News