Ven Ajahn Siripanyo: 40 వేల కోట్ల వ్యాపారం వదిలేసి సన్యాసిగా మారిన బిలియనీర్

Update: 2024-12-05 14:46 GMT

Ven Ajahn Siripanyo becomes buddhist monk: డబ్బు.. ప్రస్తుత సమాజంలో ఇదే ముఖ్యమైపోయిందనే భావన చాలామందిలో ఉంది. ధనవంతులు ఇంకా డబ్బు సంపాదించి అందరి కంటే మొదటిస్థానంలో ఉండాలని చూస్తారనే అభిప్రాయం కూడా ఉంది. ఇలా ఆస్తులు పెంచుకుని విలాసవంతమైన జీవితం గడపాలనుకునే కోటీశ్వరులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు చూస్తోన్న వ్యక్తి మాత్రం అలా కాదు. ఆస్తులు ఆయనకు సంతోషాన్ని ఇవ్వలేదు. డబ్బులో ఆనందం లేదని.. ఆధ్యాత్మిక మార్గమే ఆనంద జీవనానికి మార్గమని ఆచరించి చూపిస్తున్నారు ఓ బిలియనీర్. ఇంతకు ఆయన ఎవరనేది ఈ స్టోరీలో చూద్దాం.

బంధాల్ని తెంచుకోవడం, ఆస్తుల్ని వదులుకోవడం, సన్యాసం స్వీకరించడం.. ఎవరికీ అంత సులువు కాదంటారు. పైగా వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని వదులుకొని మరీ.. బౌద్ధ భిక్షకుడిగా మారడం మామూలు విషయం కాదు. కానీ ఆయన అవన్నీ వదులుకున్నారు. ఆయనే అజాన్ సిరిపన్యో. లెక్కలేనన్ని వ్యాపారాలు, వేల కోట్ల సామ్రాజ్యం, తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి, లగ్జరీ లైఫ్. కానీ అవేవీ ఆయన్ని ఆకర్షించలేదు. విలాసాలన్నీ కొంతవరకే అని భావించారు. బౌద్ద భిక్షువులను చూసి సరదాగా సన్యాసిగా మారిన అజాన్ సిరిపన్యో.. అందులోనే తన నిజమైన ఆనందాన్ని వెతుకుంటున్నారు. ఏకంగా రూ.50 వేల కోట్ల సామ్రాజ్యాన్ని వదిలేసి శాశ్వతంగా సన్యానం స్వీకరించారు. నిత్యం జోలె పట్టుకుని భిక్షాటన చేస్తున్నారు.

మలేషియా ధనవంతుల్లో ఒకరైన ఆనంద కృష్ణన్ టెలికమ్యూనికేషన్స్, ఉపగ్రహాలు, చమురు, రియల్ ఎస్టేట్, మీడియా వంటి రంగాల్లో కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని కలిగి ఉన్నారు. భారత సంతతికి చెందిన ఆనంద్ క‌ృష్ణన్ ఏకైక కుమారుడు వెన్ అజాన్ సిరిపన్యో. 20 ఏళ్ల కిందట అంటే ఆయనకు 18 ఏళ్ల వయసున్నప్పుడు థాయ్ రాజ వంశీకురాలైన తన తల్లి కుటుంబానికి నివాళులు అర్పించేందుకు థాయ్‌లాండ్ వెళ్లారు. ఆ పర్యటనే ఆయన లైఫ్‌ను టర్న్ చేసింది. అక్కడ బౌద్ధ భిక్షువులను చూసి ప్రేరణ పొందారు. సరదా కోసం సన్యాసిగా మారాలనుకున్నారు. కానీ నిజంగానే సన్యాసం వైపు ఆకర్షితులై.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని వదులుకున్నారు. ప్రస్తుతం పీఠాధిపతిగా థాయ్‌లాండ్, మయన్మార్ సరిహద్దుల్లో బౌద్ధ సన్యాసిగా జీవిస్తున్నారు.

లండన్‌లో పెరిగిన అజాన్.. అక్కడే చదువు పూర్తి చేశారు. 8 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. సన్యాసిగా ఉన్నప్పటికీ సిరిపన్యో అప్పుడప్పుడు తన కుటుంబాన్ని కలుస్తారు. తన తండ్రిని కూడా వ్యక్తిగతంగా కలుస్తారు. తండ్రి నుంచి వచ్చిన వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని వదులుకుని ఆధ్యాత్మిక శాంతి కోసం దాదాపు 20 ఏళ్లుగా సిరిపన్యో భిక్షాటన చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Tags:    

Similar News