Viral News: సీటు మధ్యలో చిక్కుకున్న ఐపాడ్... పేలుతుందేమోననే భయంతో మధ్యలోనే విమానం డైవర్ట్

Update: 2025-04-26 17:00 GMT
Viral News: సీటు మధ్యలో చిక్కుకున్న ఐపాడ్... పేలుతుందేమోననే భయంతో మధ్యలోనే విమానం డైవర్ట్
  • whatsapp icon

Flight diverted due to ipad stuck in seats: అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నుండి జర్మనీలోని మ్యూనిక్ బయల్దేరిన విమానం గమ్యస్థానానికి చేరకుండానే మధ్యలోనే మరో విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. అలా విమానాన్ని మార్గం మధ్యలో మరో చోటుకు డైవర్ట్ చేసి మరీ ల్యాండింగ్ చేయడం వెనుకున్న కారణం ఒక చిన్న ఐప్యాడ్ అని తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. కానీ అదే నిజం. ఔను ఒక చిన్న ఐప్యాడ్ వల్ల 461 మంది ప్రయాణికులను తీసుకెళ్తున్న విమానం మరో చోట ల్యాండ్ అవ్వాల్సి రావడంతో పాటు 3 గంటలు ఆలస్యంగా గమ్యస్థానం చేరుకోవాల్సి వచ్చింది.

ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఏప్రిల్ 23న లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ కు చెందిన A380 ఎయిర్ బస్ విమానం లాస్ ఏంజెల్స్ నుండి మ్యూనిక్ బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన తరువాత బిజినెస్ క్లాస్ సెక్షన్‌లో ఒక ప్రయాణికుడికి చెందిన ఐప్యాడ్ సీట్ల మధ్యలో చిక్కుకుపోయింది. అది అందులోంచి బయటికి రాలేదు సరికదా ఐప్యాడ్ షేప్ కూడా దెబ్బతిన్నది. ఆ ఐప్యాడ్ రూపురేఖలు చూసిన ఎయిర్ లైన్స్ సిబ్బంది విమానాన్ని బోస్టన్ లోని లోగన్ ఎయిర్ పోర్టుకు డైవర్ట్ చేశారు. అంతకంటే ముందుగా లోగన్ ఎయిర్ పోర్టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు అసలు విషయం చెప్పారు. అర్ధరాత్రి 2.30 గంటలకు విమానం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. ఆ తరువాత 3 గంటలు ఆలస్యంగా విమానం మ్యూనిక్ చేరుకుంది.

ఒక్క ఐపాడ్ వల్ల విమానాన్నే ఎందుకు డైవర్ట్ చేశారు?

ఇప్పుడు చాలామందిలో కలిగే సందేహం ఏంటంటే... ఒక చిన్న ఐపాడ్ దెబ్బతిన్నదని విమానాన్ని ఎందుకు మరో చోట ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది? మ్యూనిక్ చేరుకున్నాక సీట్ల మధ్య జామ్ అయిన ఐపాడ్ ను తీసేస్తే సరిపోయేది కదా? అని.

అయితే, లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ ఏం చెబుతోందంటే... ఐపాడ్ మాత్రమే కాదు... ఎలాంటి ఎలక్ట్రానికి డివైజెస్ లోనైనా లిథియం బ్యాటరీస్ ఉంటాయి. అవి ఒత్తిడికి గురైనప్పుడు లిథియం లీక్ అవడం, లేదా ఒత్తిడి కారణంగా వేడెక్కి పేలిపోవడం లాంటివి జరుగుతుంటాయి. అలాంటి ప్రమాదమే జరిగితే అది మొత్తానికే మోసం వస్తుంది. కానీ లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ సంస్థకు ప్రయాణికుల భద్రతే చాలా ముఖ్యం. అందుకే ఏ చిన్న అవకాశం తీసుకోవద్దు అనే ఉద్దేశంతోనే విమానాన్ని మరో ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేసి మరీ సమస్య పరిష్కరించుకున్నాకే కదలాల్సి వచ్చిందని లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ వెల్లడించింది.

Tags:    

Similar News