
Viral Video: చిరుతలకే నీళ్లు పోసి దాహం తీర్చాడు... ఆడు మగాడ్రా బుజ్జి
Viral Video of a man offering water to thirsty cheetahs: పులి, చిరుత పులి, సింహం లాంటి వణ్య మృగాలను చూస్తే ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగు తీస్తారు. లేదంటే అది డొక్క చీల్చి డోలు కడుతుంది. కానీ ఇక్కడ మనం వీడియోలో చూస్తున్న వ్యక్తి మాత్రం అలా కాదు... చిరుత పులులకే నీళ్లు పోసి వాటి దాహం తీర్చారు. అది కూడా ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఐదు చిరుత పులులు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక చెట్టు కింద ఐదు చిరుతలు రెస్ట్ తీసుకుంటున్నాయి. వాటిని చూసిన ఒక వ్యక్తి ఒక కంటైనర్ తీసుకెళ్లి దగ్గరిగా పెట్టారు. అందులో నీళ్లు పోసి వాటిని రమ్మంటూ సైగ చేశారు. అవి ఆ వ్యక్తిని ఏమీ అనకుండా వెళ్లి నీళ్లు తాగాయి. అలా క్యాన్ లో ఉన్న నీరు పోసి వాటి దాహం తీర్చారు. ఆ వ్యక్తి నీళ్లు పోస్తుంటే వెనకాల వీడియో షూట్ చేస్తున్న వాళ్లు మాట్లాడుతుండటం ఆడియోలో వినిపిస్తోంది.
మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్ లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఐదు చిరుతల్లో ఒకటి తల్లి చిరుత జ్వాల కాగా మిగతావి వాటి పిల్లలు అని ఆ చిరుతలను గుర్తుపట్టిన అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి చీతా మిత్రా లేక ఎవరైనా గ్రామస్తుడా అనేది నిర్ధారించుకోవాల్సి ఉందని అన్నారు.
చీతా మిత్రా అంటే చిరుత పులులు ఉన్న కునో నేషనల్ పార్క్ పరిసరాల్లో ఆ చుట్టు పక్కల గ్రామాల ప్రజల నుండి చిరుతలకు ఎలాంటి హానీ కలగకుండా చూసుకునేందుకు ప్రభుత్వం 51 గ్రామాల నుండి 400 మంది వాలంటీర్లను ఎంపిక చేసింది. వారికి చిరుతలను ఎలా హ్యాండిల్ చేయాలో ట్రైనింగ్ ఇచ్చింది. టీచర్స్, గ్రామ పెద్దలు, పట్వారీలకు ఈ శిక్షణ ఇచ్చారు. వారు చిరుతల సంరక్షణ బాధ్యత చూసుకుంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వాటికి హానీ కలిగించకుండా అవగాహన కల్పిస్తుంటారు.
ఏదేమైనా "కృూరమృగాలు ఎప్పుడూ ఎలా స్పందిస్తాయో ఊహించడం కష్టం. శిక్షణ లేని వారు ఇలాంటి దుస్సాహాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు" అని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.