దబంగ్ ఢిల్లీ తన జోరును కొనసాగిస్తూ హరియాణా స్టీలర్స్ పై విజయం సాధించగా.. నిన్న పూణే జట్టుపై విజయభేరి మొగించిన యు ముంబా జట్టుకు బెంగళూరు బుల్స్ చేతిలో పరాజయం ఎదురైంది. ఇదీ ఆదివారం ప్రో కబడ్డీ లీగ్ ఏడో సీజన్ లో మ్యాచ్ ల విశేషాలివి.
వరుస విజయాలతో దూసుకెళ్తోన్న దబంగ్ ఢిల్లీ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఆదివారం ఢిల్లీ 41-21 తేడాతో హరియాణా స్టీలర్స్‌ను చిత్తు చేసింది. ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లాడిన హరియాణాకు జట్టుకు ఇదే తొలి ఓటమి. మ్యాచ్‌లో ఆరంభం నుంచి ఢిల్లీ ఆధిపత్యం సాగింది. తొలి రైడ్‌లో రంజిత్ రెండు పాయింట్లు తెచ్చి జట్టుకు శుభారంభాన్నిచ్చాడు. అదే జోరు కొనసాగించిన జట్టు తొలి ఐదు నిమిషాలు ముగిసే సరికి 7-4తో ఆధిక్యంలో నిలిచింది. పుంజుకొన్న హరియాణా ఆటగాళ్లు ఓ దశలో 8-9తో ప్రత్యర్థికి సమీపంగా వెళ్లారు. అయితే ఢిల్లీ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. జోగిందర్ నర్వాల్ సూపర్ ట్యాకిల్ చేయడంతో 11-8తో నిలిచిన ఢిల్లీ.. తొలి అర్ధభాగాన్ని 15-10తో ముగించింది. విరామం తర్వాత ఆ జట్టు దూకుడు పెంచింది. రంజిత్, నవీన్ పాయింట్లు తేవడంలో పోటీపడడంతో 23వ నిమిషంలో హరియాణాను తొలిసారి ఆలౌట్ చేసి 22-12తో ఆధిక్యం సంపాదించింది. చివరి పది నిమిషాల ఆట మిగిలి ఉందనగా మరోసారి ప్రత్యర్థిని ఆలౌట్ చేసి 33-16తో మ్యాచ్‌ను శాసించింది. అదే జోరులో విజయాన్ని అందుకుంది. హరియాణా జట్టులో నవీన్ (9) రైడింగ్‌లో మెరిశాడు. అయితే ట్యాక్లింగ్‌లో విఫలమైన ఆ జట్టు పరాజయం మూటగట్టుకోవాల్సి వచ్చింది.
బెంగళూరు విజయభేరి!
బెంగళూరు బుల్స్ తిరిగి విజయాల బాట పట్టింది. ఆతిథ్య యు ముంబా జట్టుకు షాకిచ్చింది. బుల్స్ 30-26 తేడాతో ముంబాపై గెలిచింది. మొదట్లో రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఆరు నిమిషాలు ముగిసేసరికి 3-3తో సమంగా నిలిచాయి. ఇరు జట్ల ఆటగాళ్లు పాయింట్ల కోసం నువ్వానేనా అన్నట్టుగా పోరాడారు. 17వ నిమిషంలోనూ స్కోర్లు 11-11తో సమంగానే ఉన్నాయి. అయితే సౌరభ్ సూపర్ ట్యాకిల్ చేయడంతో బుల్స్ 13-11తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. విరామం తర్వాత ముంబా సత్తాచాటింది. బుల్స్‌ను ఆలౌట్ చేసి 16-13తో ఆధిక్యం సంపాదించింది. మరో నాలుగు నిమిషాల ఆట మాత్రమే మిగిలి ఉందనగా ముంబానే 23-22తో ఆధిపత్యం చలాయించింది. కానీ పవన్ వరుసగా పాయింట్లు తేవడంతో ముంబాను ఆలౌట్ చేసి 28-25తో బుల్స్ ఆధిక్యంలోకి దూసుకెళ్లి మ్యాచ్‌ను దక్కించుకుంది.