"మీ ఓటమిని ఓడించండి ఇలా"

Update: 2019-04-22 13:33 GMT

ఫ్రెండ్స్ మనం ఈ రోజు చర్చించే అంశం... "మీ ఓటమిని ఓడించండి ఇలా"

చీకటితో వెలుగే చెప్పెను..... నేనున్నాని, ఓటమితో గెలుపే చెప్పెను.....నేనున్నానని..... అని "నేనున్నాను" అనే సినిమా కోసం చంద్రబోస్ రాసిన పాట ఎంతో పాపులర్ అయ్యింది. ఇందులో ఓటమికి, గెలుపుకి వున్నా సంబంధాన్ని చక్కగా చెప్పారు రచయిత.

ఫ్రండ్స్ ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు ఓటమిని రుచి చూడవచ్చు. అయితే ఆ ఓటమిని తను ఎలా తీసుకుంటున్నాడు అనే దాని మీదే అతని భవిష్యత్తు ఆధారపడి వుంటుంది. మీరు ఒక పని అనుకున్నప్పుడు, కొన్ని సార్లు దాని సాధనలో వైఫల్యం చెందవచ్చు. కాని ఆ వైఫల్యాన్నే మీరు సరిగ్గా వాడుకుంటే, మీ విజయాల కోట కట్టడానికి, ఒక పునాది రాయిగా ఆ వైఫల్యన్ని మీరు వాడగలరు అని గుర్తించాలి.

అందుకే బల్బు కనిపెట్టిన ఎడిసన్ అంటాడు, నేను బల్బు కనుగొనే క్రమంలో 10,000 సార్లు విఫలమవ్వలేదు. నేను ఆ పని సాద్యం కాని 10,000 మార్గాలు కనుగొన్నాను అంటాడు. అలా బల్బు కనిపెట్ట క్రమంలో వచ్చిన ఫలితాలను, తన ఓటముల్లా కాకుండా..ఒక ఫీడ్ బ్యాక్ లా తీసుకున్నాడు కాబట్టే, ఎడిసన్ ఎన్నో గొప్ప విషయాలు, వస్తువులు కనిపెట్టాడు. అయితే ఈ క్రమములో మనం గతంలో చేసిన తప్పులు మర్చిపోవద్దు, అలా అని .....వాటి గురించే ఆలోచిస్తూ మాత్రం కూర్చోవద్దు.

గతం యొక్క తలంపులు, తలుపులు రెండు మూసివేసి, మీ శక్తిని లేదా మీ సమయాన్ని ఇక ఇప్పుడు చెయ్యాల్సిన పనిమీద పెట్టండి. ఓటమి అంటే అర్ధం ఏమిటంటే...మరొక్కసారి తిరిగి మొదలెట్టు అని అర్ధం. ఎక్కడైతే మనం ఆగామో, అక్కడి నుండి మల్లి ప్రకటించి, ప్రయత్నిస్తూ, మీ ప్రయాణం మొదలుపెట్టమని అర్ధం.

అందుకే అంటారు..విజయమంటే..ఒక ఓటమి నుండి మరో ఓటమికి ఉత్సాహం తగ్గకుండా, ఉరకలేస్తూ, పరుగులు పెట్టటమే అని. ఇలా ఎప్పుడైతే రెట్టించిన ఉత్సాహంతో, పడి లేచే అలలా లేస్తామో...చీకటిని చీల్చుకొని వచ్చే సూర్యుడిలా వస్తామో..... దూకే జలపాతంలా కదులుతామో, మన నీడలా మన విజయం మన వెనకే వస్తుంది మిత్రమా.

ఫ్రెండ్స్! మనం గెలవాలనే పట్టుదల ఒక ఉడుం పట్టులా వుంటే, మన గెలుపు యొక్క కోరిక కొండంత పెద్దగా వుంటే, మన విజయపు తలపు విశాల ఆకాశమంత వుంటే...ఇక అపజయం మన ముందు నిలబడలేదు. ఆ అపజయం... మనకి సలాం చేస్తూ, మనకి గులాం అంటూ..పక్కకు తప్పుకొని మన విజయానికి దారి చూపెడుతుంది. మనము చెయ్యాల్సిందల్లా ఓటమిని, ఒంటరిని చేసి దాని కళ్ళలో చూసి "నేను నీకు భయపడను" అని చెప్పగలిగే దైర్యం చూపడమే.

అలాంటి దైర్యానికి భీజం లాంటిది మన కోరిక, మనలోని కోరిక ఒక అగ్నిగుండంలా పెరిగి పెద్దదవుతుంటే, మనలోని కోరిక మర్రి చెట్టంత పెద్దగా పెరుగుతుంటే, మనలోని కోరిక తీరడం కోసం, మన ప్రతి కణ కణము పరితపిస్తుంటే............. విజయం మన జాడ వెత్తుకుంటూ వచ్చి మనతో జత కట్టదా?

ఫ్రండ్స్ అలా విజయం మనతో జత కట్టడానికి మూడు విషయాలు చాల ముఖ్యం, అవేంటో ఇప్పుడు చూద్దాము.

మొదటిది.....ఓటమి విజయ సాధనలో ఒక భాగం:

ఓటమిని విజయ సాధనలో ఒక భాగం గా ఒప్పుకోవడం, ఒక భాగంగా మలచుకోవడం , ఒక భాగంగా సాదించుకోవడం చాల ముఖ్యం. ఈ ప్రపంచంలో ఓటమిని మీరు ఒక్కరే పొందలేదు..మీలా ఎంతో మంది ఇప్పటికి వారి వారి విషయాలలో...ఈ ఓటమిని పొందారు. అలాగే వారు ఆ ఓటమిని తమ విజయానికి పెట్టుబడిగా మార్చుకున్నారు. అందుకే మనం గుర్తుకి పెట్టుకోవాల్సింది...ఓటమి అంతం కాదు, చాల సందర్బాలలో విజయానికి అది ఆరంభం అని. అలాగే జీవితంలో ఓటముల లోతు చూసినవాడు, విజయాల ఎత్తులను తప్పక చూడగలుగుతాడు.

రెండవది.......ఓటమి నేర్పే పాటం నేర్చుకోవాలి: కొన్ని సార్లు మీరు బాగా కష్టపడ్డ కూడా, అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. అప్పుడు ఇన్ని చేసిన విజయం ఎందుకు రాలేదని ఆలోచించకు, ఇంకా ఏమి చేస్తే విజయం వస్తుందని ఆలోచించు. చేసేపని బాగా కష్టమైనప్పుడు కూడా , కష్టపడేవారు ఆ పనిని బాగా చేస్తారు. కష్టాలతో కలిసి ఓటమి కూటమిలా వచ్చినా కూడా, మీరు అష్టమి రోజు పుట్టిన శ్రీ కృష్ణుడిలా ఎల్లప్పుడూ ఆనందంలో వుండాలి అని నిర్ణయం తీసుకోండి. ఓటమి తో వచ్చే ఎన్నో పాటాలు మీరు నేర్చుకోవచ్చు. ఇలా పాటాలు నేర్చుకున్నవాడు, ఇలా జీవిత పాటాలు అవపోసన పట్టినవాడు, తన విజయమనే పట్టణానికి పట్టాభిశక్తుడు అవుతాడు మిత్రమా!

మూడవది....కొత్త విజన్ వైపు ఉత్సాహంతో ముందుకు అడుగు వెయ్యాలి:

ఓటమిని అంగికరించి, దాని నుండి పాటాలు నేర్చుకున్న తర్వాత, మనం కోరుకున్న లక్ష్యం వైపు తిరిగి ప్రయాణం మొదలెట్టాలి. జీవితంలో పడిపోవటం తప్పు కాదు, పడిపోయి లేవకపోవటం తప్పు అని గుర్తించాలి. బాక్సింగ్ బరిలో పడిపోయినవాడు, లేస్తూ ఉన్నంతవరకు ఆటలో వున్నట్టు. అలాగే జీవిత బరిలో కూడా ఓటమి మనని పడేసిన కూడా, తిరిగి లేవగలగాలి. మన మనస్సులో, మన లక్షాన్ని కొత్త ప్రణాళికతో, కొత్త ఉత్సాహంతో, కొత్త శక్తితో సాదిస్తున్నట్టు ఒక విజన్ తయారుచేసుకొని, ఒక్కో అడుగు ముందుకి వెయ్యాలి. ఇలా అడుగులు ముందుకు వేస్తువెలితే...ముందుకి కదిలితే... విజయాన్ని పొందగలం, ఆనందాన్ని చెందగలం.

ఫ్రెండ్స్! ఒక చిన్న చీమ కూడా తన కన్నా బరువైన ఆహారపదార్థాన్ని తీసికెలుతు పడిపోతే, అది ఓటమిలాగా బావించక, తిరిగి నిలబడి దానిని తీసుకెలుతుంది కదా, అలాగే మనం చిన్నప్పుడు నడక నేర్చుకునేటప్పుడు, మన మొదటి అడుగు వేసి పడిపోతే, తిరిగి లేచి మరో అడుగు వేస్తాము కదా, అది ఓటమి కాదు కదా..అది మన నడకకి ప్రారంభం మాత్రమే కదా! అలాగే మొదటి సరి మనం సైకిల్ తొక్కడానికి ప్రయత్నించినప్పుడు......... పడిపోయిన కూడా, తిరిగి లేచి మల్లి ప్రయత్నించి మనం సైకిల్ తొక్కలేద...వీటన్నిటిని ఓటమిలుగా మనం బావించం కదా. అలాగే మన కోరికకి ఓటమి అంతం కాదు, మరో సారి ప్రయత్నించడానికి ఆరంభం మాత్రమే. సో ఫ్రండ్స్ మీ ఓటమిని ఇప్పటి నుండి ఒక గురువులా చూసి దాని నుండి నేర్చుకొని, విజేతలుగా నిలబడండి. అల్ ది బెస్ట్ .

Similar News