Who is Harshita Goyal: యూపీఎస్సీలో ఆలిండియా రెండో ర్యాంక్.. ఎవరీ హర్షిత?

Who is Harshita Goyal: యూపీఎస్సీలో ఆలిండియా రెండో ర్యాంక్.. ఎవరీ హర్షిత?
Who is Harshita Goyal: హర్షిత గోయల్... మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో ఆలిండియా రెండో ర్యాంక్ సొంతం చేసుకున్న యువతి ఈ హర్షిత గోయల్. దీంతో అందరి దృష్టి ఉన్నట్లుండి హర్షిత గోయల్ పై పడింది. ఇంతకీ ఎవరీ హర్షిత గోయల్ అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
హర్షిత గోయల్ పుట్టింది హర్యానాలో అయినప్పటికీ ఆమె ఎక్కువ కాలం గడిపింది మాత్రం గుజరాత్‌లో. గుజరాత్‌లో పాఠశాల విద్య పూర్తి చేసిన హర్షిత గోయల్, బరోడా యూనివర్శిటీ నుండి బీకామ్ పట్టా అందుకున్నారు. ఆ తరువాత సీఏ పూర్తిచేశారు. చదువుకునే రోజుల నుండే సమాజం కోసం ఏదైనా చేయాలనే గట్టి సంకల్పంతో పెరిగారు. ముఖ్యంగా సమాజంలో మహిళలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు, అవమానాలను రూపుమాపాలనుకున్నారు. మహిళా సాధికారిత కోసం కృషి చేయాలనుకున్నారు. మహిళలు ఏ వర్గం వారైనా, ఏ నేపథ్యం నుండి వచ్చిన వారైనా సరే... మహిళలు అందరికీ విద్య, ఉద్యోగం, ఆరోగ్యం... ఇలా అన్ని రంగాల్లో వారికి సమాన అవకాశాలు లభించేలా చేయాలనేది తన లక్ష్యం అని హర్షిత గోయల్ చెబుతున్నారు. అందుకోసం యూపీఎస్సీని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
ఒకవైపు చదువులో రాణిస్తూనే మరోవైపు వివిధ సంస్థలలో వాలంటీర్‌గా పనిచేస్తూ ప్రజా సేవ చేసేందుకు ఆసక్తి చూపించారు. గుజరాత్ యూత్ పార్లమెంట్‌లో, న్యాయ శాఖతో కలిసి పనిచేసిన అనుభవం ఆమె ఉన్నతికి బాటలు వేశాయి. బిలీవ్ ఫౌండేషన్ అనే ఎన్జీఓతో కలిసి పనిచేస్తూ తలసేమియా, క్యాన్సర్ పేషెంట్స్ కు తనవంతు సహాయం అందించారు. ఇలా వాలంటీర్ గా పనిచేస్తోన్న సమయంలోనే ఆమెకు ప్రజా ఆరోగ్యం, సామాజిక సేవ రంగాలపై మరింత ఆసక్తి పెరిగేలా చేశాయి. ఇంత బిజీ షెడ్యూల్లోనూ ఆమె తన క్రియోటివిటీ కోసం కూడా సమయం కేటాయించే వారు.
హర్షిత గోయల్‌కు ఆక్రిలిక్ పెయింటింగ్ అంటే ఇష్టం. తన దృష్టిలో అది ఒక హాబీ కాదు... తనలోని భావాలను వ్యక్తపరిచేందుకు అది ఒక మార్గం అంటారు. హర్షిత గోయల్ కోరుకున్నట్లుగానే యూపీఎస్సీలో అవకాశం సంపాదించడమే కాదు... ఏకంగా ఆలిండియా టాప్ 2 ర్యాంక్ సొంతం చేసుకోవడం ఆ కుటుంబాన్ని ఎంతో ఆనందానికి గురిచేస్తోంది.