Pahalgam Terror Attack: బెల్‌పూరి తింటున్నాం.. ముస్లిం కాదని తెలియగానే 'నా భర్తను కాల్చేశారు'

సెలవుల కోసం వెళ్లిన కుటుంబానికి ఇది శాశ్వత దుర్మార్గంగా మిగిలిపోయింది. పర్యాటక ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం...

Update: 2025-04-22 14:28 GMT
Pahalgam Terror Attack: బెల్‌పూరి తింటున్నాం.. ముస్లిం కాదని తెలియగానే నా భర్తను కాల్చేశారు
  • whatsapp icon

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఓ కుటుంబం సెలవుల్లో ఊహించని విషాదాన్ని ఎదుర్కొంది. పహల్గామ్‌లో బైసారన్ వాలీలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బెల్‌పూరి తింటున్న తమను కాల్చారని బాధితురాలు చెప్పింది. ఆమె భర్తను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాది, అతను ముస్లిం కాదని చెప్పిన వెంటనే కాల్చేశాడని ఆమె వాపోయింది. ఈ దృశ్యం ఆమె కళ్ల ముందు జరిగిందని చెబుతున్న ఆమె, ఇంకా షాక్‌ నుంచి బయటపడలేక పోతోంది.

ఘటన సమయంలో తీసిన వీడియోల్లో ఒక మహిళ ప్రాణాపాయంలో ఉన్న భర్తను రక్షించమని గట్టిగా మొరపెట్టుకుంటూ కనిపించింది. భర్త ప్రాణాలు నిలబెట్టేందుకు ఆమె చేసిన ఆర్తనాదాలు చూపరులను కలిచివేస్తున్నాయి. మరో వీడియోలో రక్తసిక్తంగా నేలపై పడిపోయిన ఇద్దరు పర్యాటకులు కనిపించారు. ఈ దాడి టూరిస్టుల ఫేవరెట్ డెస్టినేషన్ అయిన బైసారన్ వాలీలో జరిగింది. అక్కడికి వెళ్లడానికి కాలినడక లేదా గుర్రాల ద్వారా మాత్రమే చేరవచ్చు. దీంతో సహాయ చర్యలు ప్రారంభించేందుకు భద్రతా బలగాలకు కొంత సమయం పట్టింది. అయినా వెంటనే స్పందించి ఆ ప్రాంతానికి చేరుకుని గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.

ఈ దాడికి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత వహించినట్లు ప్రకటించింది. ఇది మరోసారి ఉగ్రవాదులు పర్యాటక ప్రాంతాలనే టార్గెట్ చేస్తున్నారని స్పష్టమవుతోంది. ఈ ఘటనపై పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నేత మెహబూబా ముఫ్తీ స్పందించారు. పర్యాటకులపై ఇలాంటి దాడులను హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇది కేవలం ఒకరిపై దాడి మాత్రమే కాదు, దేశ భద్రత, సామరస్యంపై చేసిన దాడి అని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. దాడికి పాల్పడినవారిని పట్టుకునేందుకు ఆర్మీ, పోలీసు శాఖ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. దాడి జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించడంతో పాటు, అనుమానితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ దాడితో పహల్గామ్ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. 

Tags:    

Similar News