Indian Woman: ఏ తల్లికి రాకూడని కష్టం... పిల్లలు బార్డర్ దాటి పాకిస్థాన్‌కు, తల్లి ఇండియాకు
Indian woman stopped while crossing India, Pakistan border: పహల్గామ్ ఉగ్రదాడి తరువాత ఇండియాలో ఉన్న పాకిస్థానీయులు దేశం విడిచిపెట్టి పోవాల్సిందిగా భారత్...

Indian woman tried to cross India, Pak border: ఇండియా, బార్డర్ వద్ద ఏ తల్లికి రాకూడని కష్టం ఒక భారతీయ మహిళకు ఎదురైంది. ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ ఆమె స్వస్థలం. వయస్సు 30 ఏళ్లు. 2020 లో పాకిస్థాన్ కరాచీకి చెందిన ఒక డాక్టర్ తో ఆ యువతికి పెళ్లయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవలే ఇండియాలో ఉన్న అమ్మానాన్నలను చూసిపోవడానికి ఆమె కరాచి నుండి భారత్ వచ్చారు.
ఇంతలోనే ఊహించని విధంగా పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని పొట్టనపెట్టుకున్న ఘటన జరిగింది. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ ప్రమేయం ఉందని బలంగా నమ్ముతున్న భారత్ అందుకు తగిన ఆధారాలు కూడా చూపిస్తోంది. అంతేకాకుండా పాకిస్తాన్ కు బుద్ధి వచ్చేలా కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంది. అందులో భాగంగానే ఇప్పటివరకు ఇండియాలో ఉన్న పాకిస్థానీయులు దేశం విడిచిపోవాల్సిందిగా స్పష్టంచేసింది. లాంగ్ టర్మ్ వీసాలపై ఉన్న వారు తప్పితే మిగతా అందరూ పాకిస్థాన్ వెళ్లిపోవాల్సిందేనని భారత్ ఆదేశాలు జారీచేసింది.
ఈ నేపథ్యంలోనే మీరట్ నుండి ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను తీసుకుని పాకిస్థాన్ బయల్దేరింది. పంజాబ్‌లోని అట్టారి - వాఘా బార్డర్ వద్ద వారు దేశం సరిహద్దులు దాటాల్సి ఉంది. అయితే, అక్కడ ఆమె డాక్యుమెంట్స్ చెక్ చేసిన అధికారులు... ఆ మహిళ పాకిస్థాన్ వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎందుకంటే ఆమె భారతీయురాలు. ఆమె వద్ద ఇండియన్ పాస్ పోర్ట్ ఉంది. ఆమె అలా దేశం దాటి వెళ్తే పాకిస్థాన్ దృష్టిలో ఆమె తప్పు చేసినట్లు అవుతుంది. కానీ ఆమె ఇద్దరు పిల్లలకు పాకిస్థాన్ పాస్ పోర్ట్ ఉంది. ఇక్కడే ఇంకో సమస్య ఎదురైంది. భారత ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఆ ఇద్దరు చిన్నారులు పాకిస్థాన్ వెళ్లిపోవాల్సిందే.
ఇద్దరు చిన్న పిల్లలేనని, వారు తనని విడిచి అస్సలే ఉండలేరని ఆ మహిళ కన్నీంటి పర్యంతమైంది. అయినప్పటికీ అధికారులు ఆమెను పాకిస్థాన్ వెళ్లేందుకు అనుమతించలేదు. భారత ప్రభుత్వం నుండి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వేచిచూడాల్సిందిగా నచ్చచెప్పి ఆమెను తిరిగి మీరట్ పంపించారు. భార్య, పిల్లలను రిసీవ్ చేసుకోవడానికి కరాచి నుండి ఇండియా - పాకిస్థాన్ బార్డర్ కు వచ్చిన ఆమె భర్త పిల్లలను తీసుకుని వెళ్లిపోయాడు. పిల్లలు ఇద్దరికీ వీడ్కోలు చెప్పలేక ఆ తల్లి పడిన నరకయాతన చూపరులకు కంటతడి పెట్టించింది.
తన భర్త, పిల్లలు పాకిస్థాన్‌లో ఉంటే... తను మాత్రం ఇలా ఊహించని రీతిలో ఇండియాలో ఉండిపోవాల్సి వస్తోందని ఆమె కన్నీళ్లుపెట్టుకున్నారు. పహల్గాం దాడిలో అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఆమె.. తనలాంటి వారి పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు.
విచిత్రం ఏంటంటే... ఆ మహిళకు తనలాంటి మహిళలు అక్కడ ఇలాంటి ఇబ్బందులు పడుతూ చాలామందే కనిపించారు. మహిళలు మాత్రమే కాదు... పాకిస్థాన్ మహిళలను పెళ్లి చేసుకున్న మగవారి పరిస్థితి కూడా అంతే. భారతీయులైన తన భర్త, పిల్లలను విడిచిపెట్టి ఆ మహిళలు తిరిగి పాకిస్థాన్ వెళ్లిపోవాల్సిన పరిస్థితి. సరిహద్దులు దాటుకుని వెళ్లి పెళ్లి చేసుకున్నప్పుడు భవిష్యత్‌లో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని వారు కూడా ఊహించి ఉండకపోవచ్చు.