Unlock 4.0 guidelines: ఐదు నెలల గ్యాప్ తర్వాత దేశంలో మెట్రో రైళ్లు మళ్లీ పరుగులు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ దక్కింది. స్కూళ్లు, షాపింగ్ మాల్స్‌కి మాత్రం మరో నెల రోజుల పాటు అన్‌లాక్ లేదని కేంద్రం తెలిపింది. దశలవారీగా కార్యకలాపాలను పున:ప్రారంభిస్తోన్న కేంద్రం విస్తృత సంప్రదింపుల తర్వాత అన్‌లాక్ 4 గైడ్‌లైన్స్‌ని విడుదల చేసింది.
కరోనా కారణంగా లాక్‌డౌన్‌లో నిలిచిపోయిన కార్యకలాపాలను పునరుద్ధరించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత విస్తృతం చేసింది. సెప్టెంబర్ ఒకటి నుంచి అన్‌లాక్ 4 అమలు కానుండటంతో ఈసారి మరిన్ని సడలింపులతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. సెప్టెంబర్ 7నుంచి మెట్రోరైళ్లను తిరిగి ప్రారంభించేందుకు అవకాశం కల్పించింది. కంటైన్‌మెంట్ జోన్‌లకు వెలుపల ఉన్న ప్రాంతాల్లో మరిన్ని కార్యకలాపాలకు హోంశాఖ అవకాశం కల్పించగా కంటైన్‌మెంట్ జోన్లలో మాత్రం సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
కేంద్ర కొత్త మార్గదర్శకాల ప్రకారం విద్యా, క్రీడా, వినోద, మత, రాజకీయ కార్యకలాపాలను ఇండోర్‌లో జరుపుకొనేందుకు అవకాశం కల్పించింది. ఈ కార్యక్రమాల్లో వందమంది వరకు పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. సెప్టెంబర్ 21నుంచి పరిమిత ఆంక్షలతో సామాజిక కార్యక్రమాలకు కూడా అనుమతి ఇచ్చింది. ఐతే వచ్చే నెల 30 వరకు స్కూల్స్, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు మూసివేత కొనసాగుతుందని స్పష్టం చేసింది.
కంటైన్మెంట్ జోన్ కాని ప్రాంతాల్లో 9 నుంచి పన్నెండో తరగతి విద్యార్థులు స్కూళ్లకు వెళ్లొచ్చని కేంద్రం తెలిపింది. దీనికి తల్లిదండ్రుల సమ్మతి కంపల్సరీ అని చెప్పింది. ఇక అటు కంటైన్‌మెంట్ జోన్లు మినహాయిస్తే స్థానికంగా స్థానికంగా కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా లాక్‌డౌన్లు విధించకూడదని మార్గదర్శకాల్లో పేర్కొంది. రాష్ట్రం పరిధిలోగానీ, అంతర్రాష్ట్ర ప్రయాణాలకు ఎలాంటి ఆంక్షలూ ఉండకూడదని సూచించింది.