Richest Railway Station: ఇండియాలో ఎక్కువ డబ్బులు సంపాదించే రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?

India's richest Railway Station: ఇండియాలో ప్రభుత్వం నిర్వహించే అతి పెద్ద సంస్థలో ఇండియన్ రైల్వేస్ ఒకటి. ప్రపంచంలోనే 5 అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్స్‌లో ఇండియన్ రైల్వే చోటు దక్కించుకుందంటే, మన రైల్వే రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
అయితే, ఇండియన్ రైల్వే అంటే చాలామందికి టికెట్స్ రూపంలోనే వారికి ఆదాయం ఉంటుందని అనుకుంటుంటారు. కానీ అంతకుమించిన ఆదాయ మార్గాలు కూడా రైల్వేకు ఉన్నాయి. అంతేకాదు.. రైల్వే స్టేషన్స్ వారిగా ఆదాయంలోనూ పోటీ ఉంటుంది. అలా ఇండియాలో ఎక్కువ మొత్తంలో ఆదాయం ఉన్న రైల్వే స్టేషన్ ఏంటి? ఏయే మార్గాల్లో ఆ రైల్వే స్టేషన్ డబ్బులు సంపాదిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియాలో మొత్తం 7,308 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. రోజూ 13,000 రైళ్లు ఇండియాలో 2 కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. రైల్వే టికెట్స్ ద్వారా వచ్చే ఆదాయం రైల్వే శాఖ ఆదాయం కింద లెక్కిస్తారు. రైల్వే స్టేషన్ ఆవరణలోని దుకాణాలు, డిజిటల్ బోర్డులపై అడ్వర్టైజ్‌మెంట్స్, హోర్డింగ్స్‌పై ప్రకటనలు, ప్లాట్‌ఫామ్స్ టికెట్స్ రూపంలో వచ్చే ఆదాయాన్ని ఆయా రైల్వే స్టేషన్స్ ద్వారా వచ్చిన ఆదాయం కింద లెక్కిస్తారు.
ఇండియాలో అత్యధిక ఆదాయం ఉన్న రైల్వే స్టేషన్లలో న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ నెంబర్ 1 ర్యాంకులో ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ 3,337 కోట్లు సంపాదించింది. రద్దీ పరంగానూ ఇదే రైల్వే స్టేషన్ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఏడాది పొడవునా ఈ రైల్వే స్టేషన్‌లో 3,93,62,272 మంది కాలుపెట్టారు.
రూ. 1692 కోట్లతో రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్‌లోని హౌరా రైల్వే స్టేషన్ ఉంది.
మూడో స్థానంలో రూ. 1299 కోట్లతో ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంది.
సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ అయిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూ. 1276 కోట్లతో నాలుగో స్థానంలో ఉంది.
ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ జంక్షన్ రైల్వే స్టేషన్ రూ. 1227 కోట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
దేశంలో అత్యధిక ఆదాయం ఉన్న 100 రైల్వే స్టేషన్ల జాబితాను తీసుకుంటే, అందులో తెలుగు రాష్ట్రాల నుండి టాప్ 5 లోని సికింద్రాబాద్ సహా మొత్తం 6 స్టేషన్స్ ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ముఖ్య పట్టణాల రైల్వే స్టేషన్స్ ఏ స్థానంలో ఉన్నాయనే విషయానికొస్తే, విశాఖపట్టణం రూ. 564 కోట్లతో 18వ స్థానంలో ఉంది.
ఆ తరువాత రూ. 528 కోట్ల ఆదాయంతో విజయవాడ 21వ స్థానంలో ఉంది.
దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి రూ. 475 కోట్ల ఆదాయంతో 28వ స్థానంలో ఉంది.
రూ. 294 కోట్ల ఆదాయంతో హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ 46వ స్థానంలో ఉంది.
ఆ తరువాత నాంపల్లి రైల్వే స్టేషన్ కేంద్రంగా సేవలు అందిస్తున్న హైదరాబాద్ రైల్వే స్టేషన్ రూ. 219 కోట్లతో 71వ స్థానంలో నిలిచింది.