విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని రాహుల్ గాంధీ సూచన
Rahul Gandhi: ఎన్నికలకు 6నెలల ముందు అభ్యర్థులను ప్రకటిస్తామన్న రాహుల్ గాంధీ
Rahul Gandhi: టీ కాంగ్రెస్ వర్గ పోరు వ్యవహారం ఢిల్లీకి చేరింది. రాహుల్ గాంధీ సమక్షంలో మూడు గంటల పాటు జరిగిన మీటింగ్‌లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను రాహుల్‌గాంధీకి నేతలు వివరించారు. అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన నేతలంతా .. హస్తిన వేదికగా వరుస సమావేశాలతో బిజీ బిజీగా గడిపారు. మొదటగా ఏఐసీసీ ఆఫీసులో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ ఆధ్వర్యంలో సీనియర్ నేతల సమావేశం జరిగింది. మరోవైపు సోనియా గాంధీతో వీహెచ్ సమావేశమై వర్గ విభేదాలను, రేవంత్ రెడ్డి తీరును వివరించినట్లు తెలుస్తుంది.
రాహుల్ గాంధీ భేటీలో 38 మంది తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనాయకులు పాల్గొన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలభిస్తుందని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేయాలని రాహుల్ గాంధీ టీ కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీని తెలంగాణలో అడుగు పెట్టకుండా చేయాలని, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ప్రజలకు తెలియజేయలన్నారు.
రాజకీయ పరిస్థితులపై రాహుల్ తో సుదీర్ఘంగా చర్చించామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయలని నిర్ణయించామన్నారు. బీజీపీకి వ్యతిరేకంగా గ్రామాలకు వెళ్లాలని రాహుల్ సూచించారని..ప్రజా సమస్యలపై పోరాడి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజల్లో పోరాటం చేయాలని నిర్ణయించుకున్నామన్నారు.
రాహుల్ ముందు తెలంగాణ కాంగ్రెస్ నేతల అసంతృప్తులు బయటపడ్డాయి. రాహుల్ గాంధీ సమావేశంలో అందరిని ఒకే దగ్గర మాట్లాడడం వల్ల రేవంత్ పై నేరుగా పిర్యాదు చేయలేకపోయామని సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఆ సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కలుగజేసుకొని రాష్ట్రంలో సీనియర్లు అసంతృప్తి తో ఉన్నారని రాహుల్ గాంధీతో చెప్పగా అన్ని తన దృష్టిలో ఉన్నాయని అందరూ కలిసి పని చేయాలని రాహుల్ దిశానిర్దేశం చేశారు. గొడవలు పక్కన పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా ప్రతి ఒక్కరు కష్టపడాలని రాహుల్ సూచించారు.
పీసీసీపై రగలిపోతున్న పలువురు సీనియర్ నేతలు రాహుల్ గాంధీకి ఒక లెటర్ పై ఫిర్యాదు చేసి ఇచ్చారు. మరోవైపు పీసీసీ తీరుపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాహుల్ గాంధీ వద్ద బాహాటంగానే వ్యతిరేకించారు. పెద్దపల్లి లో రేవంత్ రెడ్డి అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. దీనికి రాహుల్ గాంధీ కలుగజేసుకొని ఎన్నికలకు 6 నెలల ముందు తానే స్వయంగా అభ్యర్ధులను ప్రకటిస్తానన్నారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ నేత వీహెచ్ ఆరోపించారు. రైతులకు అండగా ఉంటూ కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. పెట్రోల్, డీజిల్, విద్యుత్ ధరలను పెంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులపై భారం వేస్తుందని ఆరోపించారు.