Pahalgam Terror Attack: నేడు జమ్మూ బంద్ కు పార్టీల పిలుపు..పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే?

Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ దాడిలో టెర్రరిస్టులు పర్యాటకులను వారి మతాన్ని అడుగుతూ కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు కొన్ని వివరాలు వెల్లడించారు. జమ్మూలోని అందమైన మైదానాల్లో ఉన్న పహల్గామ్ లో ఉగ్రవాదులు చేసిన హింసకాండ సంచలనం రేపింది. మినీ స్విట్జర్లాండ్ అని పిలిచే ఈ పర్యాటక ప్రదేశంలో మంగళవారం పర్యాటకులపై టెర్రరిస్టులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఫలానా మతాన్ని అవలంబించలేదనే కారణంతో 28 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్నారు ఉగ్రవాదులు.
ప్రత్యక్ష సాక్షులు చెప్పిన కథనం ప్రకారం..ఉగ్రవాదులు స్థానిక పోలీస్ దుస్తులు ధరించి, ఫేస్ మాస్కులు ధరించి వచ్చారు. మొదట టూరిస్టుల పేర్లు..మతం అడిగారు. ఆ తర్వాత కల్మా చదవమని బలవంతం చేశారు. కల్మా చదవని వారిని..సంకోచించిన వారిని అక్కడికక్కడే కాల్చి చంపారు. ముఖ్యంగా హిందూ పురుషులనే టార్గెట్ చేశారు. మహారాష్ట్రలోని పూణే నుంచి పహల్గామ్ సందర్శనకు వచ్చిన ఆశావరి మాట్లాడుతూ..దుండగులు పురుషులను వేరు చేసి కల్మా చదవమని బలవంతం చేశారు. చదవని వారిని అక్కడికక్కడే కాల్చి చంపారు. పోలీసుల తరహా యూనిఫామ్స్ ను చూసి దాడి చేసిన వారు టెర్రరిస్టులని ఎవరూ ఊహించలేరన్నారు.
మరణించినవారిలో ఇద్దరు విదేశీయులు, ఇద్దరు స్థానికులు ఉన్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ..ఈ ఉగ్రదాడి దుర్మార్గమని వ్యాఖ్యానించారు. మధ్యాహ్నం 3గంటల సమయం ఈ దాడి జరిగింది. జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సహా పలు పార్టీలు బుధవారం బంద్ కు, నిరసనలకు పిలుపునిచ్చాయి. దీంతో జమ్మూ అంతటా కూడా భారీ భద్రతను పెంచారు.
ఈ దాడి నేపథ్యంలో కాంగ్రెస్, జమ్మూ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, జమ్మూ బార్ అసోసియేషన్, విశ్వహిందూ పరిషత్, రాష్ట్రీయ భజరంగ్ దళ్ జమ్ముకశ్మీర్ యూనిట్ బుధవారం ఒకరోజు జమ్మూ బంద్ కు పిలుపునిచ్చాయి. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ప్రత్యేక నిరసనలు ప్రకటించారు. బుధవారం జమ్మూ ప్రజలు సంపూర్ణ బంద్ పాటించాలని విజ్నప్తి చేసిన పీసీసీ ప్రధాన అధికార ప్రతినిధి రవీందర్ శర్మ ఉగ్రవాదులు అమాయకులను చంపడం సరికాదన్నారు. తమ గడ్డపై ఉగ్రవాదాన్ని సహించేది లేదన్న సందేశాన్ని ఇచ్చేందుకు సంపూర్ణ బంద్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు.