Pakistan-India News: మూడేళ్ల జైలు, రూ.3లక్షల జరిమానా.. ఇండియాలో ఉన్న పాకిస్థానీలకు భారీ షాక్!
Pakistan-India News: రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి.

Pakistan-India News: మూడేళ్ల జైలు, రూ.3లక్షల జరిమానా.. ఇండియాలో ఉన్న పాకిస్థానీలకు భారీ షాక్!
Pakistan-India News: భారత్‌లో తాత్కాలిక వీసాలతో ఉన్న పాకిస్థాన్ పౌరులు గడువులోగా దేశం విడిచిపోకపోతే తీవ్ర శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్-2025 ప్రకారం, వీసా గడువు మించి బస చేసిన వారు లేదా వీసా నిబంధనలు ఉల్లంఘించిన వారు లేదా నిషిద్ధిత ప్రాంతాల్లో ప్రవేశించిన వారు గరిష్ఠంగా 3 సంవత్సరాల జైలుశిక్ష లేదా రూ.3 లక్షల వరకు జరిమానా లేదా రెండూ ఎదుర్కోవలసి ఉంటుంది.
ఇదే క్రమంలో కేంద్రం భారత్‌లో తాత్కాలిక వీసాలతో ఉన్న పాకిస్థాన్ పౌరులకు లీవ్ ఇండియా నోటీసులు జారీ చేసింది. వీరంతా ఏప్రిల్ 27లోపు దేశం విడిచిపోవాలని ఆదేశించింది. అయితే వైద్య వీసాతో ఉన్న వారికి ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చి, ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చింది. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో పాక్ ఆధారిత సంస్థల ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో కేంద్రం ఈ కఠిన చర్యలు తీసుకుంది. ఈ దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బిజినెస్, జర్నలిస్ట్, కాన్ఫరెన్స్, స్టూడెంట్, విజిటర్,, ఫిల్మ్, మౌంటనీరిం, పిల్గ్రిమ్, గ్రూప్ టూరిస్ట్ వీసాలతో ఉన్న పాకిస్థాన్ పౌరులు సహా మొత్తం 12 రకాల వీసాలపై భారత్‌లో ఉన్నవారిని ఏప్రిల్ 27 లోపు వెనక్కు పంపించాలని కేంద్రం స్పష్టం చేసింది.
ఇక మూడు రోజుల వ్యవధిలో వాఘా-అటారీ సరిహద్దు గేట్ ద్వారా 509 మంది పాకిస్థానీయులు భారత్‌ను విడిచిపెట్టారు. వీరిలో తొమ్మిది మంది రాజనీతిక ప్రతినిధులు కూడా ఉన్నారు. ఇదే సమయంలో 745 మంది భారతీయులు, వీరిలో 14 మంది అధికారిక ప్రతినిధులు, పాకిస్థాన్ నుండి భారత్‌కు తిరిగి వచ్చారు.
భారత్ తీసుకున్న చర్యలకు ప్రతిగా పాకిస్థాన్ కూడా సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్ (సార్క్) వీసా మినహాయింపు పథకాన్ని (SVES) రద్దు చేసి భారత్ పౌరులకు ఇచ్చిన వీసాలను రద్దు చేసింది. ఇటు పహల్గాం దాడిలో తమ ప్రమేయం లేదని పాకిస్థాన్ తిరస్కరించింది. సత్యాన్ని వెలికితీయడానికి తటస్థమైన అంతర్జాతీయ దర్యాప్తు జరిపించాలని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరియు రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ డిమాండ్ చేశారు.