పాకిస్థాన్‌లో నాకెవ్వరూ లేరు... నా భర్త భారతీయుడు, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి?

Update: 2025-04-27 10:29 GMT
పాకిస్థాన్‌లో నాకెవ్వరూ లేరు... నా భర్త భారతీయుడు, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి?
  • whatsapp icon

Pakistan Woman Living in India: పహల్గామ్ ఉగ్ర దాడి ఘటన తరువాత పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలతో కొత్తకొత్త ఉదంతాలు వెలుగులోకొస్తున్నాయి. ముఖ్యంగా భారత్‌లో ఉంటున్న పాకిస్థానీలు దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఇచ్చిన ఆదేశాలు కొంతమంది పాకిస్థాన్ పౌరులను అయోమయంలో పడేస్తున్నాయి. కేవలం బతుకుదెరువు కోసమే బార్డర్ దాటి వచ్చిన వాళ్లు మళ్లీ తట్టాబుట్టా సర్దుకుని దేశం దాటిపోతున్నప్పటికీ ఇక్కడే దశాబ్దాల తరబడిగా స్థిరపడి, ఇక్కడే పెళ్లిళ్లు చేసుకుని బంధాలు పెనవేసుకొన్న వారి పరిస్థితే అగమ్య గోచరంగా ఉంది.

తాజాగా ఒడిషాలో నివాసం ఉంటున్న ఒక పాకిస్థాన్ పౌరురాలి కథ కూడా అలానే ఉంది. శారదా బాయి 1970 లో పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ లోని సుక్కూర్ సిటీలో జన్మించారు. ఆ తరువాత ఇండియాకు వచ్చారు. గత మూడు దశాబ్ధాలకుపైగా ఒడిషాలో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త కూడా భారతీయుడే. పెళ్లి తరువాత ఆమె పేరు శారదా కుక్రెజగా పేరు మారింది. ఇప్పుడు ఆమెకు ఒడిషా పోలీసులు దేశం విడిచి పోవాల్సిందిగా ఎగ్జిట్ నోటీసులు జారీచేశారు. ఆ నోటీసులు చూసి శారద షాక్ అయ్యారు.

"30 ఏళ్లకు పైగా ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడే కుటుంబం ఏర్పడింది. పాకిస్థాన్‌లో నాకంటూ ఎవ్వరూ లేరు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి, ఎవరి దగ్గరికి వెళ్లాలి? అసలు ఎవరు ఉన్నారని వెళ్లాలి" అని శారద ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. "తనకు లాంగ్‌టర్మ్ వీసా కానీ లేదా ఇతర మినహాయింపులు కానీ ఏవీ లేనందున దేశం విడిచి వెళ్లకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు" అని శారద వాపోయారు.

పాకిస్థాని పౌరురాలు శారదకు ఇండియాలో ఆధార్ కార్డ్, ఓటర్ కార్డు

శారద వద్ద ఉన్న పాకిస్తాన్ పాస్‌పోర్ట్ ప్రకారం ఆమెను పాకిస్థాన్ పౌరురాలు కిందనే గుర్తించాల్సి ఉంటుంది. పాకిస్థాన్‌లో హిందూ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చారు. కానీ తన వద్ద ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ ఉన్నాయని, భారత పౌరసత్వం కోసం కూడా ఎప్పుడో దరఖాస్తు చేసుకున్నాను కానీ అది ఇంకా రాలేదని శారద చెబుతున్నారు. పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌పై ఇండియాకు వచ్చిన శారద అన్నివిధాలుగా ఇక్కడే స్థిరపడిపోయారు. దేశం నలుమూలలా ఇలా ఇంకెంతమంది శారదలు ఉన్నారో గుర్తించడం కూడా కష్టమే. 

Tags:    

Similar News