Pahalgam terrorist attack: పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిపై స్పందించిన ప్రపంచ దేశాలు.. ఎవరేమన్నారంటే..

Pahalgam terrorist attack latest news updates: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది టూరిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో పది మందికిపైగా పర్యాటకులు గాయపడ్డారు. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌది అరేబియా వెళ్లిన ప్రధాని మోదీ తన పర్యటనను మధ్యలోనే ముగించుకుని భారత్‌కు తిరిగివచ్చారు.
పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిపై స్పందించిన ప్రపంచ దేశాలు, ఉగ్రవాదుల పైశాచికత్వంపై కన్నెర్ర చేశాయి. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వంటి నేతలు స్పందించారు. పర్యాటకుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన వివిధ దేశాధినేతలు... ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు అండగా ఉంటామని ప్రకటించారు.
మోదీకి ఫోన్ చేసిన డోనల్డ్ ట్రంప్
పహల్గామ్ ఉగ్రవాది దాడిపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ట్రంప్, ఉగ్రవాదులకు శిక్షపడేలా చేయడంలో భారత్ కు ఎప్పుడూ తమ సహాయం ఉంటుందని అన్నారు. ఉగ్రవాదంపై పోరులో అమెరికా, భారత్ ఎప్పుడూ కలిసే పని చేస్తాయని ట్రంప్ చెప్పారని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి రణ్‌ధీర్ జైశ్వాల్ ఎక్స్ (గతంలో ట్విటర్) ద్వారా తెలిపారు.
ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్ ద్వారా కూడా స్పందించిన ట్రంప్, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కష్టకాలంలో భారత్‌కు తను అండగా నిలుస్తామన్నారు.
కశ్మీర్ ఉగ్రదాడిపై స్పందించిన చైనా
పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిపై చైనా విదేశాంగ శాఖ స్పందించింది. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన చైనా... మృతులు, బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ ఈ ప్రకటన విడుదల చేశారు.
మై డియర్ ఫ్రెండ్ మోదీ - బెంజమిన్ నెతన్యాహు
ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఎక్స్ ద్వారా స్పందించారు. మై డియర్ ఫ్రెండ్ మోదీ, పహల్గామ్ ఎటాక్ మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అని అన్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాడ సానుభూతి ప్రకటించిన నెతన్యాహు... ఉగ్రవాదంపై పోరాటంలో ఇజ్రాయెల్ భారత్‌తో కలిసి పని చేస్తుందని స్పష్టంచేశారు.
ఇటలీ ప్రధాని మెలోని
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పహల్గామ్ ఉదంతాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కష్టకాలంలో ఇటలీ ఇండియాకు అండగా నిలుస్తుందన్నారు. మృతుల కుటుంబాలకు ఆమె తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.
తగిన శిక్ష పడుతుంది - వ్లాదిమిర్ పుతిన్
కశ్మీర్ లో ఉగ్రదాడిపై భారత్ చిరకాల మిత్ర దేశమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందిస్తూ, ఉగ్రవాద దాడులను తిప్పి కొట్టడంలో భారత్‌కు తాము మరింత సహకారం అందిస్తామని మరోసారి తేల్చి చెప్పారు. కశ్మీర్ లో ఉగ్రదాడి చాలా అన్యాయమన్న పుతిన్, ఉగ్రవాదులకు తగిన శిక్ష పడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన పుతిన్... బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఎంతటి సహాయమైనా అందించేందుకు సిద్ధం - సౌది అరేబియా ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్
ప్రధాని మోదీ సౌది అరేబియాకు వెళ్లిన కొన్ని గంటల్లోనే ఈ ఉగ్రదాడి జరిగింది. దాడి జరిగినప్పుడు ప్రధాని మోదీ సౌదిలోనే ఉన్నారు. దాడి తరువాత ఆయన తన పర్యటనను మధ్యలోనే ముగించుకుని ఇండియాకు తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో సౌది అరేబియా స్పందిస్తూ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ స్పందిస్తూ ఉగ్రదాడిపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ కష్టకాలంలో సౌది అరేబియా భారత్ కు అండగా నిలుస్తుందని చెబుతూ ఉగ్రదాడిని తిప్పి కొట్టేందుకు ఎంతటి సహాయమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రోన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్‌తో పాటు మార్షియస్, శ్రీలంక, యూరోపియన్ కమిషన్, యురోపియన్ యూనియన్, నేపాల్, డెన్మార్క్, పాకిస్థాన్, యూఏఇ భారత్‌కు మద్దతుగా ప్రకటనలు విడుదల చేశాయి.