Pahalgam Terror Attack: పాకిస్థాన్ అమ్మాయి, భారత్ అబ్బాయి.. ఉగ్రదాడితో ఆగిన వివాహం..!
Pahalgam Terror Attack: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.

Image Source ANI
Pahalgam Terror Attack: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ దాడికి స్పందనగా భారత్ తన పొరుగుదేశం పాకిస్తాన్‌తో ఉన్న అన్ని ద్వైపాక్షిక సంబంధాలను నిలిపివేసింది. దీనివల్ల ఎందరో సాధారణ ప్రజలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. అటువంటి ఘటనలలో ఒకటి ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ కుటుంబం పడింది.
రాజస్థాన్‌కు చెందిన షాతన్ సింగ్ అనే యువకుడికి పాకిస్తాన్‌లోని ఓ హిందూ కుటుంబానికి చెందిన యువతితో ఈ ఏప్రిల్ 24న పెళ్లి జరగాల్సి ఉంది. అన్ని ఏర్పాట్లు పూర్తవడంతో కుటుంబాలు పెళ్లి కోసం ఎదురు చూస్తున్న సమయంలో భారత్ తీసుకున్న కీలక నిర్ణయం వారికి షాక్ ఇచ్చింది. వాఘా-అట్టారి సరిహద్దు మూసివేయడంతో పాక్ నుండి వధువు తరపు కుటుంబ సభ్యులు భారత్‌లోకి రాలేకపోయారు. దీంతో వారి పెళ్లి వాయిదా పడింది.
రాజస్థాన్‌లోని భారత్-పాక్ సరిహద్దు గ్రామాల్లో ఉన్న చాలా మందికి పాక్‌లో బంధువులు ఉన్నారు. కాలానుగుణంగా తాము సంబంధాలను కొనసాగిస్తూ పెళ్లిళ్లు వంటి కుటుంబ వేడుకల్లో కూడా పరస్పర హాజరయ్యేవారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అట్టారి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ను తాత్కాలికంగా పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుతం ఇండియాలో SVES (Short Visit Emergency Stay) వీసా కింద ఉన్న పాకిస్తానీ పౌరులు 48 గంటల గడువులో దేశాన్ని విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. ఈ ఉగ్రదాడి కారణంగా కేవలం రాజకీయ, భద్రతా పరమైన ప్రభావాలు మాత్రమే కాక సాధారణ ప్రజల, వారి జీవన శైలి, భావోద్వేగ సంబంధాలపై కూడా ప్రభావం చూపుతోంది.