Terrorist Attacks In India: ఇండియాను కంపించేసిన ఉగ్రదాడులు.. మూడు దశాబ్దాలకు పైగా ఆగని క్రూరత్వం
Terrorist Attacks In India: ఇవి కేవలం గణాంకాలు కాదు.. ప్రతి సంఖ్య వెనక ఓ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయిన కథ ఉంది. ఒక్కో ఘటనలో దేశ గుండె లోతుల్లో చెరగని మచ్చ వేసిన దుశ్చర్య ఉంది.

Terrorist Attacks In India: ఇండియాను కంపించేసిన ఉగ్రదాడులు.. మూడు దశాబ్దాలకు పైగా ఆగని క్రూరత్వం
Terrorist Attacks In India: ఉగ్రవాదం అంటే కేవలం ఒక బాంబు శబ్దం కాదు.. అది ఒక తల్లి చేతిలో పడుకునే పసిబిడ్డ గుండె ఆగిపోవడం..! ఒక నవ్వుతో రైలు ఎక్కిన యువతి తిరిగి శవంగా దిగి రావడం..! ఒక పండుగ రోజు కుటుంబం మొత్తం రక్తపు చీకట్లో కూరుకుపోవడం..! ఉగ్రవాదం అంటే భయాన్ని పెంచడం కాదు.. అది ఆశలను తుడిచేసే కిరాతకత్వం. మతాన్ని సాకుగా చెప్పుకుంటూ మానవత్వాన్ని బలిగొట్టే దుర్మార్గం ఈ ఉగ్రవాదం. నాటి ముంబై ఉగ్రదాడి నుంచి నేటి పహల్గాం ఉన్మాద దాడి వరకు ఉగ్రవాదం చెబుతున్న అర్థాలు ఇవే. జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి మరోసారి దేశ గుండెను నిద్రలేపింది. కన్నీటి రాతలతో రాసిన కశ్మీర్ చరిత్రలో ఇది ఒక కొత్త దుఃఖ అధ్యాయం. అయితే ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు.. ఈ మట్టిపై ఎన్నో ఘోర దాడులు జరిగాయి. మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది. దేశాన్ని కంపించేసిన ఆ ఘోర దాడులను ఓసారి గుర్తు చేసుకుందాం.
ఫిబ్రవరి 14, 2019.. దేశచరిత్రలో చీకటి రోజు. దేశం ఊహించని విషాదాన్ని చూసింది. జమ్ముకశ్మీర్-పుల్వామాలో జరిగిన దారుణ దాడిలో 40 మంది CRPF జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. క్యాంటిన్ నుంచి తిరిగి క్యాంప్‌కు వస్తున్న జవాన్లు.. ఎప్పటిలాగే తమ విధుల్ని ముగించి విశ్రాంతికి సిద్ధమవుతున్నారు. కానీ వారికి మిగిలింది విశ్రాంతి కాదు.. శాశ్వత నిశ్శబ్దం! పేలుళి ధ్వనితో ఒక్కసారిగా ఆ లోయను నిండిపోయింది. ఈ దాడిలో దాదాపు 300 కిలోల అధిక శక్తివంతమైన మెటల్‌ను వాడారు. ఆత్మాహుతి దాడికి దిగిన ఉగ్రవాది.. ప్రాణాలు తీసిన విధానం చూస్తే... అది మానవత్వాన్ని చీల్చే అసహ్యమైన ఘటనగా నిలిచిపోయింది. ఒక్కసారిగా తూటాల శబ్దం, ఎగిసిపడుతున్న మంటలు.. అక్కడి నుంచి బయటపడింది కేవలం శవాలు మాత్రమే. ఒక్క బస్సులో కూర్చున్న 40 మంది సైనికుల గాథ.. ఒక్క క్షణంలో దేశ గుండెలో శూన్యతకు కారణమైంది. ఆ ఘటన తర్వాత దేశం వేదనలో మునిగిపోయింది. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో, ప్రతి మనసులో ఆ బాధ ప్రతిధ్వనించిపోయింది.
శాంతిగా నిద్రిస్తున్న సైనికుల మీద తుపాకీతో దాడి చేయడమే నిజమైన పిరికితనానికి నిదర్శనం. 2016 సెప్టెంబర్ 18న జమ్ముకశ్మీర్‌లోని యూరిలో ఉన్న ఆర్మీ క్యాంప్‌పై పాకిస్తాన్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు దాడికి దిగారు. ఆ దాడిలో 17 మంది భారత జవాన్లు మరణించారు. టెంట్లు, షెల్టర్లలో నిద్రిస్తున్న జవాన్లు మంటల్లో సజీవదహనమయ్యారు. ఈ దాడి తర్వాత భారత సైన్యం ప్రతీకార చర్యలకు దిగింది. పాక ఆక్రమిత కశ్మీర్‌లోకి ప్రవేశించి సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది.
ఒక నగరం రాత్రికి రాత్రే రక్తపు నదిగా మారిపోతుందని ఎవరూ ఊహించలేరు. 2008 నవంబర్ 26న ముంబై నగరం రక్తసిక్తమైంది. 10మంది ఉగ్రవాదులు తాజ్ హోటల్, CST రైల్వే స్టేషన్ లాంటి ప్రదేశాల్లో కాల్పులకు దిగారు. ఈ ఘటనలో 166 మంది అమాయకుల ప్రాణాలు బలయ్యాయి. ప్రపంచమంతా చూస్తుండగా, ముంబై వీధుల్లో మానవత్వం చెల్లాచెదురైంది.
శాంతంగా గడిచే ప్రాచీన నగరం జైపూర్. కానీ 2008 మే 13న ఒక్క 15 నిమిషాల్లో తొమ్మిది బాంబులు పేలడం..ఆ మహానగరాన్ని రక్తపు చీకట్లో ముంచింది. ఈ ఘటనలో 80 మంది ప్రాణాలు పోయాయి. 170 మందికి పైగా గాయాలపాలయ్యారు. పండుగ వేళలో బాంబులు పేలడం, ఊహించని విధంగా ప్రజల గుండెల్లో భయాన్ని నాటింది.
2006 జూలై 11న ముంబైలో సాయంత్రం రష్ అవర్ సమయంలో ముష్కరులు బరితెగించారు. ప్రయాణికుల రద్దీ తీవ్రంగా ఉండే వేళ.. ఒక్కసారిగా 11 నిమిషాల్లో 7 బాంబులు పేలిపోయాయి. సబ్ అర్బన్ రైల్వేలో ప్రయాణిస్తున్న 209 మంది మరణించారు. 700 మందికి పైగా గాయపడ్డారు. ఇది కూడా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ చేసిన పనే.
ఇక దేశ ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన పార్లమెంట్ బిల్డింగ్‌ను టార్గెట్ చేసిన దుష్టచర్య ఇది. డిసెంబర్ 13, 2001న ఉగ్రవాదులు పార్లమెంట్‌పై కాల్పులకు తెగబడ్డారు. మొత్తం 9 మంది ప్రాణాలు పోయాయి. పార్లమెంట్ సిబ్బంది, పోలీస్ అధికారులు, గార్డెనర్ కూడా మృతి చెందారు. ఐదుగురు ఉగ్రవాదులు అక్కడికక్కడే హతమయ్యారు.
ఇక మార్చి 12, 1993.. ముంబై నగరం ఒక్కరోజులోనే కుప్పకూలిపోయింది. 13 వరుస బాంబు పేలుళ్లతో నగరంలోని చాలా భవనాలు కూలిపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, ప్లాజా థియేటర్, సెంట్రల్ బ్యాంక్... ప్రతి చోట రక్తపు అడుగులు కనిపించాయి. ఈ ఘటనలో 257 మంది చనిపోగా, 700 మందికి పైగా గాయాలయ్యాయి. నాటి ఘటనకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన సూత్రధారి. ఇలా ఎన్నో ఘటనలు దేశాన్ని చిదిమేశాయి. ఇవి కేవలం గణాంకాలు కాదు.. ప్రతి సంఖ్య వెనక ఓ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయిన కథ ఉంది. ఒక్కో ఘటనలో దేశ గుండె లోతుల్లో చెరగని మచ్చ వేసిన దుశ్చర్య ఉంది.