ఎక్స్‌క్యూజ్ మి అని అన్నందుకే ఇంగ్లీష్‌లో మాట్లాడతావా అని మూకుమ్మడిగా దాడి చేశారు
Marathi vs English tensions: మహారాష్ట్రలో ఉన్నప్పుడు మరాఠి మాట్లాడాలి కానీ ఇంగ్లీష్ మాట్లాడతావా అంటూ ఒక మహిళపై పక్కింటి కుటుంబం దాడిచేసిన ఘటన ఇది.

ఎక్స్‌క్యూజ్ మి అని అన్నందుకే ఇంగ్లీష్‌లో మాట్లాడతావా అని మూకుమ్మడిగా దాడి చేశారు
Marathi vs English tensions: మహారాష్ట్రలో ఉన్నప్పుడు మరాఠి మాట్లాడాలి కానీ ఇంగ్లీష్ మాట్లాడతావా అంటూ ఒక మహిళపై పక్కింటి కుటుంబం దాడిచేసిన ఘటన ఇది. ఆ మహిళ చేతిలో 9 నెలల పసికందు విషయం ఉందని తెలిసి కూడా దాడి చేయడం ఆపలేదు. అడ్డం వచ్చిన ఆమె భర్తపై కూడా విచక్షణారహితంగా దాడి చేశారు. ముంబైకి సమీపంలోని కళ్యాణ్ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే...
ఓల్డ్ డాంబివిలిలోని గణేష్ శ్రద్ధా బిల్డింగ్ లో పూనం గుప్తా అనే మహిళ కుటుంబం నివాసం ఉంటోంది. సోమవారం పనిమీద బయటికి వెళ్లిన గుప్తా తిరిగి తన స్నేహితురాలు జ్యోతి చవాన్ తో కలిసి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో పక్కింట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుండటంతో ఇంి ముందు అంతా సందడిగా ఉంది. తమ ఇంట్లోకి వెళ్లడానికి వీలు లేకుండా పక్కింటికి వచ్చిన చుట్టాలు దారిలో నిలబడ్డారు. దాంతో వారిని కొంచెం పక్కకు జరిగి దారి ఇవ్వాల్సిందిగా కోరుతూ పూనం గుప్తా గౌరవంగా "ఎక్స్‌క్యూజ్ మి" అని అడిగారు.
ఎక్స్‌క్యూజ్ మి అని అడగడంతోనే అక్కడున్న వారికి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే ముందుగా గుప్తాతో వచ్చిన మహిళపై పడి దాడి చేశారు.
ఇటీవల కాలంలో కర్ణాటక, మహారాష్ట్రలో బయటి రాష్ట్రాల నుండి వచ్చిన వారిని భాష విషయంలో దాడులు జరుగుతున్న ఘటనలు తరచుగా వారల్లోకొస్తున్నాయి. మహారాష్ట్రలో మరాఠిలో మాట్లాడాలి కానీ ఇంగ్లీష్‌లో ఎందుకు మాట్లాడుతున్నారని వారిని తప్పుపట్టారు. అంతేకాదు... మరాఠిలో మాట్లాడాల్సిందిగా గుప్తాను, జ్యోతి చవాన్ ను పట్టుబట్టారు. మధ్యలో అడ్డం వచ్చిన పూనం గుప్తా భర్తపై కూడా దాడి చేశారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి ఇరువర్గాలను పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆత్మరక్షణ కోసం గుప్తా భర్త కూడా తిరగబడటంతో ఇరువర్గాలకు గాయాలయ్యాయి. ఇదే విషయమై ఇరువర్గాలు పరస్పరం ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నాయి. కానీ దాడికి సంబంధించిన వీడియో బయటికొచ్చాక పోలీసులకు అసలు తప్పు ఎవరిదో అర్థమైంది. పూనం గుప్తా కుటుంబాన్ని బాధిత కుటుంబంగా పరిగణిస్తూ వారి వాంగ్మూలానికే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.