మహారాష్ట్రకు చెందిన మరో మంత్రి కరోనా భారిన పడ్డారు. సామాజిక న్యాయ శాఖా మంత్రి, ఎన్సీపీ సీనియర్ నాయకుడు ధనుంజయ్ ముండేకు కరోనా సోకింది. దాంతో ఆయనను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అయితే ఆయనలో వైరస్ లక్షణాలు లేకుండా కరోనా బయటపడిందని రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి రాజేశ్ తోపే శుక్రవారం వెల్లడించారు. కాగా ధనుంజయ్ ముండే రెండు రోజుల కిత్రం ఎన్సీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొనడమే కాకుండా కేబినెట్ సమావేశానికి కూడా హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో ఆయనతో ఎవరెవరు భేటీ అయ్యారో, ఆయన ఎవరెవరిని కలిసారో తెలుసుకునేందుకు అధికారులు ట్రేసింగ్ మొదలుపెట్టారు. కాగా మంత్రులకు భారత వైద్య పరిశోధనా మండలి నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని రాజేశ్ తోపే తెలిపారు. ఎవరైనా దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో ఇబ్బందులు పడుతుంటే కచ్చితంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా ధనుంజయ్ ముండే కంటే ముందు మహారాష్ట్ర మంత్రులు జితేంద్ర అవధ్ (ఎన్సీపీ), అశోక్ చవాన్ (కాంగ్రెస్)లకు కరోనా సోకిన సంగతి తెలిసిందే.