
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ అనుమానాస్పద మృతి... రక్తపు మడుగులో శవం
Karnataka Former DGP Om Prakash murder case: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆదివారం బెంగళూరులోని ఆయన సొంతింట్లోనే రక్తపు మడుగులో ఆయన శవం కనిపించింది. మృతదేహంపై గాయాలున్నాయి. ఓం ప్రకాశ్ డెడ్ బాడీ గురించి ఆయన భార్య పల్లవి పోలీసులకు సమాచారం అందించారు. పల్లవి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనస్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించిన అనంతరం ఆయన శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్‌లో ఓం ప్రకాశ్‌కు 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. మొదటి అంతస్తులో ఓం ప్రకాశ్ నివసిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 68 ఏళ్లు. భార్య పల్లవి, కూతురు ఉన్నారు.
1981 బ్యాచ్‌కు చెందిన ఈ ఐపీఎస్ ఆఫీసర్ 2015 లో కర్ణాటక డీజీపీగా అపాయింట్ అయ్యారు. అంతకంటే ముందు అగ్నిమాపక శాఖ, అత్యవసర సేవల విభాగానికి అధిపతిగా పనిచేశారు.
ఓం ప్రకాశ్ శవంపై గాయాలు ఉండటం, ఆయన శవం చుట్టూ రక్తం పడి ఉండటం చూస్తోంటే ఇంట్లో వారి పాత్రపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కర్ణాటక పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరు పోలీసులు ఓం ప్రకాశ్ భార్య పల్లవి, ఆయన కూతురును ప్రశ్నిస్తున్నారు. ఘటన జరిగిన తీరుతెన్నులపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్యకు గురయ్యారనే వార్త పెను సంచలనం సృష్టించింది. మాజీ డీజీపీకే రక్షణ లేకపోతే ఇక మాములు పౌరుల పరిస్థితి ఏంటని జనం ప్రశ్నిస్తున్నారు.