Jammu Terror: జమ్మూలో ఉగ్రదాడి.. విశాఖ వాసులను వెంటాడి మరి కాల్చేసిన ముష్కరులు

Jammu Terror: జమ్మూకశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్యాటకులు మరణించారు. విశాఖకు చెందిన చంద్రమౌళి, హైదరాబాద్ కు చెందిన ఇంటెలిజెన్స్ ఉద్యోగి మనీశ్ రంజన్ మరణించారు. కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న మనీశ్ రంజన్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. కోఠీలోని ఇంటెలిజెన్స్ సబ్సిడరీ కార్యాలయంలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మనీశ్ రంజన్ ఎల్టీసీలో భాగంగా జమ్మూకశ్మీర్ పర్యటనకు వెళ్లారు. భార్య ఇద్దరు పిల్లలతో కలిసి కాశ్మీర్ లో పర్యటిస్తున్న మనీశ్ రంజన్ ను ఉగ్రవాదులు కాల్చారు. దాడికి ముందు మనీశ్ రంజన్ ప్రయాణిస్తున్న ట్రావెల్స్ బస్సును చుట్టుముట్టిన ఉగ్రవాదులు అందులోని ప్రయాణికులను కిందికి దించేశారు. అతని వద్ద పత్రాలను పరిశీలించి తర్వాత కుటుంబ సభ్యులను విడిచిపెట్టారు. అనంతరం మనీశ్ రంజన్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మనీశ్ భార్య, ఇద్దరు పిల్లల ముందే ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఉగ్రవాదుల దాడి సమయంలో మనీశ్ కుటుంబం బస్సులోనే ఉంది. బస్సు కిందకు దింపి పేరు అడిగి, గుర్తింపు కార్డు చూసిన తర్వాత తలకు గురి పెట్టి కాల్చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బీహార్ కు చెందిన మనీశ్ రంజన్ ఉద్యోగంలో భాగంగా హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్నారు. 2022లో హైదరాబాద్ కు బదిలీపై వచ్చారు. 4 రోజుల క్రితం కాశ్మీర్ పర్యటనకు వచ్చారు. సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్నారు. హైదరాబాద్ క్వార్టర్ లో ఒంటరిగా నివసిస్తున్న మనీశ్ రంజన్ బీహార్ లో ఉంటున్న కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అటు విశాఖవాసిపై కూడా కాల్పులు జరిపారు. ఈ దాడిలో చంద్రమౌలి మరణించారు. స్నేహితులతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన చంద్రమౌళి ఉగ్రవాదుల దాడిలో పారిపోయేందుకు ప్రయత్నించినా ఉగ్రవాదులు వెంటాడి మరీ కాల్పులు జరిపారు. విశాఖకు చెందిన చంద్రమౌళి ఆరుగురు స్నేహితులతో కలిసి జమ్మూకశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 18న కాశ్మీర్ వెళ్లి 26న తిరుగు ప్రయాణం కావాల్సింది. ఈ బ్రుందంలో మిగిలినవారు సురక్షితంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎయిరిండియా విమానంలో స్వస్థలాలకు బయలుదేరినట్లు బంధువులు మీడియాకు సమాచారం అందించారు.