Chandrayaan-3: జయహో చంద్రయాన్.. జాబిల్లి తొలి ఫొటోలు.. షేర్ చేసిన ఇస్రో..
Chandrayaan-3 Mission: చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో పంపిన చంద్రయాన్- 3.. జాబిల్లిపై దిగేందుకు అతి చేరువలో ఉంది.
Chandrayaan-3 Mission: చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో పంపిన చంద్రయాన్- 3.. జాబిల్లిపై దిగేందుకు అతి చేరువలో ఉంది. తాజాగా ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్.. సొంతగాంనే చంద్రుడి చుట్టూ తిరుగుతోంది. అయితే ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి బయటికి వచ్చిన విక్రమ్ ల్యాండర్.. మొదటిసారి జాబిల్లి ఫోటోలు, వీడియోలు పంపించింది. ఈనెల 23 న చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగనుంది.
దేశ వ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూస్తోన్న చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకు జరిగిన అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేసుకున్న చంద్రయాన్-3.. చివరి ఘట్టానికి చేరుకుంది. తాజాగా ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్.. చంద్రుడి, ఫొటోలు, వీడియోలు తీసింది. వాటిని పంపించడంతో ఇస్రో సోషల్‌మీడియాలో పంచుకుంది. అయితే గురువారమే ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోగానే ల్యాండర్ ఈ ఫొటోలను తీసినట్లు ఇస్రో తెలిపింది.
విక్రమ్ ల్యాండర్ పంపించిన ఫొటోలు, వీడియోల్లో చంద్రుడి ఉపరితలంపై క్రేటర్లు స్పష‌్టంగా కనిపిస్తున్నాయి. ఆ క్రేటర్లను కూడా ఇస్రో వెల్లడించింది. ఫ్యాబ్రీ క్రేటర్, గియార్డనో బ్రునో క్రేటర్, హర్కేబి జే క్రేటర్ ఫొటోలను తీసి విక్రమ్ ల్యాండర్ పంపించినట్లు ఇస్రో తెలిపింది. అయితే ఈ మూడు క్రేటర్లలో గియార్డనో బ్రునో అనేది చంద్రుడిపై ఇటీవలే గుర్తించిన అతిపెద్ద క్రేటర్లలో ఒకటని ఇస్రో స్పష్టం చేసింది.
అటు.. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన ల్యాండర్.. చంద్రుడికి మరింత చేరువైంది. ఇది ప్రస్తుతం సొంతంగా చంద్రుడి కక్ష్యలో తిరుగుతోంది. శుక్రవారం సాయంత్రం చేపట్టిన వేగాన్ని తగ్గించే ప్రక్రియ విజయవంతమైనట్లు ఇస్రో వెల్లడించింది. ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద సుమారు 70 డిగ్రీల దక్షిణ ఆక్షాంశం వద్ద విక్రమ్ ల్యాండర్ దిగనుంది.