Indus Water Treaty: భారత్ నిజంగానే ఆ నీటిని అడ్డుకోవచ్చా? ఈ నీటి వివాదం తర్వాత ఏం జరగబోతుంది?
Indus Water Treaty: నీటిని ఆయుధంగా మార్చితే, అది ఎవరికీ లాభం కాదు. శాంతిగా, సహకారంతో, పరస్పర గౌరవంతో ముందుకెళ్తేనే ఈ వివాదానికి ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.

Indus Water Treaty: భారత్ నిజంగానే ఆ నీటిని అడ్డుకోవచ్చా? ఈ నీటి వివాదం తర్వాత ఏం జరగబోతుంది?
Indus Water Treaty Pakistan India Row Pahalgam
Indus Water Treaty: ఒక నది నీరు కూడా యుద్ధానికి కారణం అవుతుందంటే నమ్మగలరా? భారత్-పాకిస్తాన్ మధ్య ఓ ఒప్పందం ఉంది. ఆ ఒప్పందాన్ని ఇప్పుడు భారత్ రద్దు చేస్తుందా అన్న ప్రశ్నలతో అంతర్జాతీయంగా చర్చలు ఊపందుకున్నాయి. ఇండస్ నది నీరు ఇకపై పాకిస్తాన్‌కి ఇవ్వడం ఆపేస్తామన్నది భారత్ వాదన. ఇది సాధ్యమేనా? భారత్ నిజంగానే ఆ నీటిని అడ్డుకోవచ్చా? అయితే ఇప్పటివరకు ఎందుకు ఇచ్చింది ? ఈ నీటి వివాదం తర్వాత ఏం జరగబోతుందో అనేది చాలామందికి అంతుపట్టకపోయే విషయం.
నదులు నిమిషానికి వేలాది లీటర్ల నీటిని తీసుకెళ్తుంటాయి. ఆ నీరు ఎక్కడినుంచి వస్తుందో, ఎక్కడికెళ్తుందో మనం పెద్దగా ఆలోచించం. కానీ ఆ నీరు ఆపేస్తే? దేశాల మధ్య యుద్ధానికి కారణం అవుతుందంటే? ఏ దేశానికైనా నీరు జీవనాధారం. అదే నీరు ఆయుధంగా మారితే పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు అందరికీ కలుగుతున్న అనుమానం. భారత్ పాకిస్తాన్‌కు వెళ్లే సింధు జలాలను ఆపేయగలదా? ఒకవేళ నిజంగా ఆపగలిగితే, పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? 1960లో భారత్, పాకిస్తాన్ మధ్య 'ఇండస్ వాటర్ ట్రిటీ' అనే ఒక చరిత్రాత్మక ఒప్పందం జరిగింది. ఇది రెండు దేశాల మధ్య పెద్దగా గొడవలు జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, పశ్చిమ నదులు అంటే ఇండస్, జెలమ్, చెనాబ్ జలాలను పాకిస్తాన్ వాడుకోవచ్చు. ఇక తూర్పు నదులు రవి, బియాస్, సుతలేజ్… ఇవి భారత్‌కి కేటాయించబడ్డాయి. అంటే భారత్ తన వాటా నీటిని ఎలా కావాలన్నా వాడుకోవచ్చు. కానీ పశ్చిమ నదులను పరిమితంగా వినియోగించాలి. అటు పాకిస్తాన్ కు కూడా తూర్పు నదులపై హక్కు లేనట్టే. ఇలా దేశాలు ఒక ఒప్పందం పెట్టుకుని ఇప్పటివరకు జలవనరులను ఉపయోగించుకుంటూ వచ్చాయి.
కానీ, పరిస్థితులు మారిపోయాయి. ఉగ్రవాద దాడులు పెరిగాయి. భారత్‌లోని పుల్వామా, ఉరి ఘటనల తర్వాత భారత్ గట్టిగానే స్పందించింది. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తన బాధ్యతగా భావించే నీటి భాగాన్ని ఇకపై పాకిస్తాన్‌కి ఇవ్వనని ప్రకటించడమే కాదు, దానికి అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించే పనిలో కూడా పడింది. కిషన్‌గంగా ప్రాజెక్ట్, రాట్లే డామ్ వంటి వాటితో పశ్చిమ నదులపై భారత్ నియంత్రణ పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇండస్ వాటర్ ట్రిటీ ఒప్పందం ప్రకారం, కొన్ని పరిమితుల వరకు నీటిని నిల్వ చేయవచ్చు, వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు భారత్ ఆ హక్కుల్ని పూర్తిగా వినియోగించుకుంటే, పాకిస్తాన్‌కు వెళ్లే నీటి ప్రవాహం తగ్గిపోతుంది.
అయితే.. భారత్ పాకిస్తాన్‌కి ఇచ్చే నీటిని పూర్తిగా ఆపగలదా? అంటే...సాంకేతికంగా, ఒప్పందం ప్రకారం, ఆ అవకాశం లేదు. కానీ, భారతదేశం తన వాటా నీటిని పూర్తిగా వాడుకోవడం ద్వారా పాకిస్తాన్‌కు వచ్చే నీరు తగ్గే అవకాశం మాత్రం ఉంది. ఇది పాకిస్తాన్ వ్యవసాయాన్ని, నీటి అవసరాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. పాకిస్తాన్ ఇప్పటికే చాలా నీటి సమస్యలు ఎదుర్కొంటోంది. అలాంటి పరిస్థితుల్లో భారత్ మరింత ఒత్తిడి తేవడం అనేది రాజకీయంగా కూడా భారీ పరిణామాలకు దారి తీస్తుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఇది కేవలం నీటి గొడవ కాదు.. రెండు అణు శక్తుల మధ్య దౌత్య సంబంధాలకు సంబంధించిన వ్యవహారం. భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తే, అంతర్జాతీయంగా అది న్యాయసమ్మతమేనా అనే ప్రశ్నలు రావొచ్చు. అయితే దీనికి సమాధానంగా భారత్ ఏం చెబుతోంది అంటే.. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆపకపోతే , మేము కూడా కట్టుబాట్లు పాటించాల్సిన అవసరం లేదని.
అయితే భారత్ మరియు పాకిస్తాన్ మధ్య నీటి వివాదం కేవలం నీటి వనరులపై ఆధారపడిన సమస్య మాత్రమే కాదు, ఇది రెండు అణు శక్తుల మధ్య శాంతి, భద్రత, మరియు భవిష్యత్తు తరాల సంక్షేమంపై ప్రభావం చూపే అంశం. ఈ వివాదం పరిష్కారం కోసం అంతర్జాతీయ సహకారం, సమర్థవంతమైన చర్చలు, పరస్పర విశ్వాసం ఎంతో అవసరం. ఎందుకంటే ఇది కేవలం రెండు దేశాల మధ్య సమస్య కాదు.. రెండు ప్రజల మధ్య సంబంధానికి పరీక్ష కూడా. నీటిని ఆయుధంగా మార్చితే, అది ఎవరికీ లాభం కాదు. శాంతిగా, సహకారంతో, పరస్పర గౌరవంతో ముందుకెళ్తేనే ఈ వివాదానికి ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.