Ind vs Pak: ఆర్మీ ఆపరేషన్స్ చూపించొద్దు.. మీడియా సంస్థలకు కేంద్రం హెచ్చరిక

Update: 2025-04-26 15:38 GMT
Ind vs Pak: ఆర్మీ ఆపరేషన్స్ చూపించొద్దు.. మీడియా సంస్థలకు కేంద్రం హెచ్చరిక
  • whatsapp icon

India vs Pakistan: పహల్గామ్ దాడి తరువాత దేశంలో పరిస్థితి అంతా ఒక్కసారిగా మారిపోయింది. ఇన్నాళ్లు ప్రశాంతంగా కనిపించిన ఇండియాలో ఇప్పుడు యుద్ధపూరిత వాతావరణం కనిపిస్తోంది. ఇండియా, పాకిస్థాన్ మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరగొచ్చేమో అనేంతలా సీన్ మారిపోయింది. పహల్గామ్ దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో యావత్ దేశం రగిలిపోతోంది. ఇండియా ఎప్పుడు పాకిస్థాన్ పై మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందా అని దేశం అంతా ఎదురుచూస్తోంది.

ఇదే విషయమై తాజా పరిస్థితిని వివరిస్తూ మీడియా సంస్థలు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బలగాలు చేస్తోన్న యుద్ధ విన్యాసాలను చూపిస్తున్నాయి. భారత భద్రతా బలగాలు యుద్ధానికి సిద్ధం అవుతున్నాయంటూ ఆర్మీ సన్నాహాల దృశ్యాలను టెలికాస్ట్ చేస్తున్నాయి.

అయితే, భద్రతా బలగాలకు సంబంధించిన దృశ్యాలను, మరీ ముఖ్యంగా యుద్ధపూరిత వాతావరణం ఉన్న సమయంలో సైనికుల కదిలికలు, వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఆ తరువాత ఏం చేయబోతున్నారు అనే సున్నితమైన సమాచారాన్ని వెల్లడించకూడదు. వార్తా సంస్థలకు ఇది ఎప్పటి నుండో ఉన్న ఒక కనీస నిబంధన. ఎందుకంటే, ఆ సున్నితమైన సమాచారాన్ని శత్రువులు వారి ప్రయోజనం కోసం వాడుకునే ప్రమాదం ఉంది.

ఇదే విషయాన్ని కేంద్రం మరోసారి గుర్తుచేస్తూ ఆర్మీ బలగాల కదలికలు, వారి ప్రస్తుత దృశ్యాలు టీవీల్లో, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో పంచుకోకూడదు అని హెచ్చరికలు జారీచేసింది. ఆర్మీకి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని అయినా సరే వెల్లడించకూడదు అని ప్రకటించింది. లేదంటే ప్రాణాలకు తెగించి ఆర్మీ చేస్తోన్న ఆపరేషన్స్ కు భంగం కలిగించడంతో పాటు వారి ప్రాణాలను ఆపదలో పడేయడమే అవుతుందని కేంద్రం అభిప్రాయపడింది.

అంతేకాకుండా, గతంలో దేశంలో జరిగిన అతి ముఖ్యమైన ఆపరేషన్స్ లో మీడియా ద్వారా సమాచారం లీక్ అవడం వల్ల జరిగిన నష్టాన్ని కూడా కేంద్రం ఈ సందర్భంగా గుర్తుచేసింది. 

Tags:    

Similar News