Pahalgam: ఇండియా-పాక్ వార్.. గతంలో ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరగబోతోంది?
Pahalgam: ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు రావడానికి పాకిస్థాన్ ఉన్మాద ఆలోచనలే కారణమంటారు విశ్లేషకులు.

Pahalgam: పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్-పాకిస్థాన్ చుట్టూ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఒకవేళ ఇండియా-పాక్ నిజంగానే యుద్ధం వస్తే అది భీకరంగా సాగడం ఖాయమనే చెప్పాలి. యుద్ధం అంటే కేవలం బుల్లెట్ల మోత కాదు.. అది సామాన్యుల కలలను చీల్చే శబ్దం. ఓ బాంబు పేలిన చోట ఒక ఊరు ఊపిరాడకుండా చనిపోయే విధ్వంసమే యుద్ధం. ఒక్కరోజు యుద్ధం జరిగితేనే వేలాది ప్రాణాలు మట్టిలో కలిసిపోతాయి. ఇంటి గడప దాటి వెళ్లిన సైనికుడి కాలుజాడలు తిరిగి వస్తాయా అనే ఆందోళన వారి కుటుంబసభ్యుల్లో కనిపిస్తుంది.
యుద్ధం అంటే గెలుపు-ఓటమి కాదు.. అది జీవితం, మరణం మధ్య నడిచే ఓ రక్తపు రేఖ. ఒక్క నిర్ణయం వేలాది మంది జీవితాలను తుడిచిపెట్టగల శక్తిని కలిగి ఉంటుంది. ఇండియా-పాకిస్తాన్ మధ్య ఇప్పుడు మాటలే మంటలవుతున్నాయి. ఈ మంటలు రాక్షసరూపం దాల్చితే అంతేసంగతి..! అయితే గతంలోనూ ఇండియా-పాకిస్థాన్ మధ్య పలు సందర్భాల్లో యుద్ధాలు జరిగాయి.
1947దేశ విభజన తర్వాత మొదటిసారి ఇండియా-పాక్ తలపడ్డాయి. 1965లో మరోసారి ఘర్షణకు దిగాయి. 1971లో బంగ్లాదేశ్ కోసం భారత్ సైనికులు ప్రాణత్యాగాలు చేశారు. ఇక 1999లో కార్గిల్ గుట్టల్లో జరిగిన ఘోర సంగ్రామం గురించి ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటూనే ఉంటారు. ప్రతీసారి పాకిస్తాన్ కుట్రలు, దుర్మార్గపు దాడులే ఈ యుద్ధాలకు కారణమయ్యాయి. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు రావడానికి పాకిస్థాన్ ఉన్మాద ఆలోచనలే కారణమంటారు విశ్లేషకులు. ఎందుకంటే పహల్గాం దాడులకు పాల్పడిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'కు అండదండలు అందిస్తున్నది పాకిస్థానే!