Pahalgam Attack: ఢిల్లీలో 5000 మంది పాకిస్థానీలు... ఢిల్లీ పోలీసులకు నిఘా వర్గాల సమాచారం

5000 Pakistani nationals staying in Delhi: ఢిల్లీలో 5000 మంది పాకిస్థానీలు ఉన్నట్లు ఇంటెలీజెన్స్ బ్యూరో గుర్తించింది. ఆ జాబితాను ఢిల్లీ పోలీసులకు పంపించింది. దాంతో ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ అయ్యారు. నిఘా వర్గాలు ఇచ్చిన జాబితాలో ఎంతమందికి వ్యాలిడ్ వీసా ఉంది, ఎంతమంది అనధికారికంగా నివాసం ఉంటున్నారో గుర్తించే పనిలో పడ్డారు.
ఏఎన్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు ఫారెన్ రీజినల్ ఆఫీస్ అధికారులు ఢిల్లీలో నివాసం ఉంటున్న పాకిస్థానీల జాబితాను పంపించారు. ఆ జాబితాను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు జిల్లా పోలీసులతో పంచుకున్నారు. ఒక ఉన్నతాధికారి చెప్పిన వివరాల ప్రకారం సెంట్రల్ ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ జిల్లాల్లోనే ఎక్కువ మంది పాకిస్థానీలు నివాసం ఉంటున్నారు.
అయితే, పహల్గాం ఉగ్ర దాడి ఘటన తరువాత పాకిస్థానీలు 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని, ఆ తరువాత కూడా ఇక్కడే ఉండే వారిపై చర్యలు తీసుకుంటామని భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ ఇచ్చిన ఈ ఆదేశాలతోనే దేశంలో ఉన్న చాలామంది పాకిస్థానీలు ఇప్పటికే దేశం విడిచివెళ్లిపోయారు. ఈ 5 వేల మంది పాకిస్తానీల్లో ఎంత మంది పాకిస్తాన్ వెళ్లిపోయారు? ఇంకా ఎవరైనా ఇక్కడే తలదాచుకున్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. నిఘా వర్గాలు, ఫారెన్ రీజినల్ ఆఫీస్ ఇచ్చిన జాబితాను తీసుకుని పాక్ పౌరులు ఉంటున్న అడ్రస్ కు వెళ్లి కనుక్కుంటున్నారు.
లాంగ్ టర్మ్ వీసాలు ఉన్న వారు మినహా మిగతా అందరినీ పాకిస్థాన్ వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర హోంశాఖ నుండి అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన సమాచారం ఉన్న విషయం తెలిసిందే. కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో అన్ని రాష్ట్రాల పోలీసులు వారి వారి రాష్ట్రాల్లో ఉంటున్న పాకిస్థానీలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
పాకిస్థాన్ పౌరులకు ఇచ్చిన మెడికల్ వీసాలకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. ఆ లోగా వారు కూడా దేశం విడిచి వెళ్లిపోవాలి. ప్రస్తుతం లాంగ్ టర్మ్ వీసాలు ఉన్న వారికి మాత్రమే భారత్ మినహాయింపు ఇచ్చింది. మున్ముందు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ ఇంకా మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.