Fire Accident: చమురు క్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం..
అస్సాంలోని ఓ చమురు క్షేత్రంలో భారీ మంటలు చెలరేగాయి, రెండు వారాలుగా లీక్ అవుతున్న వాయువు ఒక్కసారిగా మండింది.
అస్సాంలోని ఓ చమురు క్షేత్రంలో భారీ మంటలు చెలరేగాయి, రెండు వారాలుగా లీక్ అవుతున్న వాయువు ఒక్కసారిగా మండింది. ఈ ఘటన రాష్ట్రంలోని టిన్సుకియా జిల్లాలోని బాగ్జన్‌లో జరిగింది. అగ్నిప్రమాదం కారణంగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. సమీపంలోని ఇళ్లకు పొగ అంటుకుంది. దాంతో దాదాపు 30 ఇళ్లలోని ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. వెంటనే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్), అగ్నిమాపక దళం మంటలను అదుపుచేశాయి. ప్రస్తుతం 3 వేలకు పైగా ప్రజలను సమీప ప్రాంతాల నుండి తరలించారు. కాగా సమాచారం తెలుసుకున్న అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ వెంటనే టిన్సుకియా కలెక్టరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. అలాగే కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోను మాట్లాడారు. మంటలను అదుపు చేయడానికి వైమానిక దళం సహాయం కోరినట్లు తెలుస్తోంది.
అయితే ముఖ్యమంత్రి ప్రతిపాదనకు రక్షణ మంత్రి తగిన విధంగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా గత 14 రోజులుగా బావి నుంచి గ్యాస్ లీక్ అవుతోందని ఒక అధికారి తెలిపారు. మంగళవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని.. మంటలను ఆర్పడానికి సింగపూర్ నుండి నిపుణుల బృందం కూడా వచ్చినట్టు తెలిపారు. మరోవైపు ఈ సంఘటనపై ఆయిల్ ఇండియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. సంఘటన జరిగిన సమయంలో బావిని శుభ్రం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ సంఘటన ఎలా జరిగిందనే సమాచారం ఇంకా తెలియరాలేదని.. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని.. అయితే ఒఎన్‌జిసిఎల్ అగ్నిమాపక సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపింది.