Pahalgam Horse rider: ఉగ్రవాది నుండే తుపాకీ లాక్కుని మరీ.. కశ్మీరీ హార్స్ రైడర్ సాహసం

Pahalgam Horse rider: ఉగ్రవాది నుండే తుపాకీ లాక్కుని మరీ.. కశ్మీరీ హార్స్ రైడర్ సాహసం
Pahalgam Horse rider Syed Adil Hussain Shah: పహల్గాం ఉగ్ర దాడి ఘటన యావత్ ప్రపంచాన్ని షాక్ కు గురయ్యేలా చేసింది. పహల్గాం ప్రాంతానికి 7 కిమీ ఎగువన ఉన్న బైసరన్ లోయకు మినీ స్విట్జర్లాండ్‌గా పేరుంది. ఇక్కడి పచ్చిక బయళ్లు, తేటని నీటితో నిండిన సరస్సులను చూసేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అయితే, ఇక్కడికి రహదారి మార్గం లేకపోవడంతో కాలి నడకన లేదా గుర్రపు స్వారీలపై వెళ్లాల్సి ఉంటుంది.
పహల్గాంలో ఉంటూ బైసరన్ వెళ్లే పర్యాటకులను తన గుర్రంపై తీసుకులవెళ్లే స్థానిక యువకుడు సయ్యద్ ఆదిల్ హుస్సెన్ షా కూడా ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. తను తీసుకువెళ్లిన పర్యాటకులను కాపాడే ప్రయత్నంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడుతున్న ఉగ్రవాదులలో ఒకరి నుండి రైఫిల్ లాక్కుని వారిపై పోరాడే క్రమంలోనే ఉగ్రవాదులు షాను కూడా హతమార్చారు.
#WATCH | J&K | Mother of the Anantnag resident Syed Hussain Shah, who lost his life in the #PahalgamTerroristAttack, gets emotional, says, "He was the only bread earner of the family..." pic.twitter.com/W7BgzeVOEC
— ANI (@ANI) April 23, 2025
అసలేం జరిగిందంటే..
రోజు తరహాలోనే మా కుమారుడు హుస్సేన్ షా బైసరన్ వ్యాలీకి గుర్రపు స్వారీని తీసుకుని వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఉగ్రదాడి గురించి మాకు తెలిసింది. వెంటనే షాకు ఫోన్ చేస్తే స్విఛాఫ్ వచ్చింది. ఆ తరువాత మరోసారి ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అయింది కానీ ఎవ్వరూ ఎత్తలేదు. భయంతో వెంటనే మేం లోకల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాం. అక్కడికి వెళ్లాకే తెలిసింది తమ కుమారుడు బుల్లెట్ గాయాలతో ఆస్పత్రిలో చేర్పించారని. ఆ తరువాతే షా మృతి చెందాడు అని షా తండ్రి ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
గుర్రపు స్వారీపై పర్యాటకులను బైసరన్ తీసుకువెళ్లడమే సయ్యద్ ఆదిల్ హుసేన్ షాకు జీవనాధారం. షా సంపాదనపైనే ఆయన కుటుంబం ఆధారపడి జీవిస్తోంది. షాకు తల్లిదండ్రులు, భార్య పిల్లలు ఉన్నారు. షా మృతితో ఇప్పుడు వారి కుటుంబం రోడ్డున పడింది. హుస్సేన్ షా తల్లిదండ్రులకు ముగ్గురు కుమారులు కాగా షా పెద్దవాడు. ఇంటిని పోషిస్తున్న వ్యక్తి కూడా అతనే. కానీ షా ఇలా అర్ధాంతరంగా ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోవడాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది.
షా కుటుంబానికి ప్రభుత్వమే న్యాయం చేయాలని బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని తగిన శిక్ష విధించాలని, అప్పుడే షా కుటుంబానికి జరిగిన అన్యాయం మరో కుటుంబానికి జరగకుండా ఉంటుందని బంధువులు డిమాండ్ చేశారు.