Hemant Soren Oath: జార్ఖండ్‌లో మళ్లీ సోరెన్ ప్రభుత్వం, మూడోసారి ముఖ్యమంత్రిగా హేమంత్ సోరన్ ప్రమాణం
Hemant Soren Oath: జార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సీఎం కావడం ఇది మూడోసారి.
Hemant Soren Oath:హేమంత్ సోరెన్ మరోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రి అయ్యారు. గురువారం మూడోసారి సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ సోరెన్‌తో ప్రమాణ స్వీకారం, గోప్యతా ప్రమాణం చేయించారు. మనీలాండరింగ్ కేసులో బెయిల్ రావడంతో హేమంత్ సోరెన్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యారు. దీంతో చంపై సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హేమంత్ సోరెన్ తండ్రి, జేఎంఎం అధినేత శిబు సోరెన్, ఆయన తల్లి రూపి సోరెన్, భార్య కల్పనా సోరెన్, జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని కూటమి సీనియర్ నేతలు హాజరయ్యారు. బుధవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన చంపై సోరెన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా హేమంత్ సోరెన్‌ను గవర్నర్ రాధాకృష్ణన్ ఆహ్వానించారని, జూలై 7న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని జేఎంఎం అంతకుముందు తెలిపింది. అయితే హేమంత్ సోరెన్ గురువారమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని కూటమి నేతలతో నిర్ణయించారు. చంపై సోరెన్ రాజీనామా తర్వాత, హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దావా వేశారు.
జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు హేమంత్ సోరెన్ 5 నెలల తర్వాత జైలు నుంచి జూన్ 28న విడుదలయ్యారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో JMM నాయకుడిని ఈడీ జనవరి 31, 2024న అరెస్టు చేసింది. అయితే అరెస్టు అయిన కొద్దిసేపటికే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు.దీంతో చంపై సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. తాజాగా హేమంత్ సోరెన్ కు బెయిల్ రావడంతో మరోసారి సీఎంగా బాధ్యతలను చేపట్టారు.