
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో కర్ణాటకకు చెందిన ఒక కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. శివమొగ్గకు చెందిన మంజునాథ్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి కాశ్మీర్‌కు సెలవులకు వెళ్లగా, దారుణమైన ఘటన అతని ప్రాణాన్ని బలిగొంది. దాడి జరిగినప్పుడు అతని భార్య పల్లవి, కొడుకుతో కలిసి అక్కడే ఉన్నారు.
పల్లవి చెప్పిన వివరాల ప్రకారం, మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో వారు పహల్గామ్ వద్ద ఉన్న సమయంలో ముగ్గురు నుండి నలుగురు వ్యక్తులు తుపాకులతో వచ్చి ఆకస్మికంగా దాడి చేశారు. మంజునాథ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడిని తన కళ్లముందే చూసిన పల్లవి తట్టుకోలేని విషాదంలో ఉన్నారు. ఆమె వివరించిన ప్రకారం, దాడికి పాల్పడిన వారిలో ఒకరు మతపరమైన మాటలు చెప్పినట్టు తెలిపారు.
దాడి అనంతరం పల్లవికి అక్కడి స్థానికులు సహాయం చేశారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, దాడికి పాల్పడిన వారిలో ఒకరు ఆమెను చంపకుండా, ప్రధానిని ఉద్దేశిస్తూ ఒక వ్యాఖ్య చేశాడు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ దాడి ఉద్దేశపూర్వకంగా హిందువులను లక్ష్యంగా చేసుకొని జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే మంజునాథ్ మృతదేహాన్ని వెంటనే కర్ణాటకకు తరలించేందుకు సహకరించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఆ ప్రాంతం పర్వత ప్రాంతమైన కారణంగా మృతదేహాన్ని తరలించేందుకు సమస్యలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. అందుకే హెలికాప్టర్ ద్వారా మృతదేహాన్ని తరలించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ దాడిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రంగా స్పందించారు. ఉగ్రదాడిలో కర్ణాటక వాసి ప్రాణాలు కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కేంద్రానికి సమాచారం అందించామని, రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ ఘటన మళ్లీ కాశ్మీర్‌లో హిందువుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. పర్యాటకులపై జరిగిన ఈ దాడి మానవత్వానికి వ్యతిరేకంగా ఉన్నదని సోషల్ మీడియాలో ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు.