FIIT JEE Case: వందల కోట్లు దోచుకున్న శుద్ధపూస కాలేజీ.. అడ్డంగా దొరికిపోయారుగా!
FIIT JEE Case: 2025-26 విద్యా సంవత్సరంలో 9823 మంది విద్యార్థుల నుంచి రూ.181.89 కోట్లు వసూలు చేశారు.

FIIT JEE Case: వందల కోట్లు దోచుకున్న శుద్ధపూస కాలేజీ.. అడ్డంగా దొరికిపోయారుగా!
FIIT JEE Case: FIIT JEE కేసులో ఈడీ చేసిన తనిఖీలతో ఒక భారీ మోసం బయటపడింది. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా), ఢిల్లీ, హరియాణాలోని గుర్గావ్ ప్రాంతాల్లో ఏప్రిల్ 24న జరిపిన దాడుల సందర్భంగా అధికారులు ఆందోళనకర విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. విద్యా సేవల పేరుతో విద్యార్థుల నుంచి సుమారుగా రూ.206 కోట్లు వసూలు చేసినా, వాస్తవానికి చెప్పిన విధంగా సర్వీసులు అందించలేదని, ఆ సొమ్ము వ్యక్తిగత అవసరాలకు మళ్లించారని ఈడీ అధికారులు వెల్లడించారు.
విద్యార్థుల నుంచి వసూలు చేసిన సొమ్ముతో టీచర్ల జీతాలు కూడా చెల్లించకుండా, అనధికారిక ప్రయోజనాలకు ఖర్చు పెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల గాజియాబాద్, లక్నో, మీరట్, నోయిడా, ప్రయాగరాజ్, ఢిల్లీ, భోపాల్, గ్వాలియర్, ఇండోర్, ఫరిదాబాద్, గుర్గావ్, ముంబై వంటి ప్రధాన నగరాల్లో ఉన్న 32 కోచింగ్ సెంటర్లు ఒక్కసారిగా మూసివేసినట్టు అధికారులు తెలిపారు. దీనివల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఈ కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 కింద విచారణ చేపట్టినట్లు ఈడీ తెలిపింది. లక్నో, నోయిడా, ఢిల్లీ, భోపాల్ తదితర ప్రాంతాల్లో ఫైలయిన పలు ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. FIIT-JEE డైరెక్టర్ డీకే గోయల్, సీఈఓ, సీఓఓ, సీఏఫ్ఓ నివాసాల్లో, సంస్థ అధికార కార్యాలయాల్లో సైతం ఈడీ తనిఖీలు జరిపింది. కంపెనీ సీనియర్ మేనేజ్‌మెంట్ విద్యా సేవల పేరుతో పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేసి, విద్యార్థులకు హామీ ఇచ్చిన విధంగా విద్యను అందించకుండా నేరప్రవర్తనలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.
తనిఖీల్లో పెద్ద మొత్తంలో నకిలీ డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన మొత్తం వివరాలు కూడా బయటపడ్డాయి. 2025-26 విద్యా సంవత్సరంలో 9823 మంది విద్యార్థుల నుంచి రూ.181.89 కోట్లు వసూలు చేశారు. అలాగే 2026-27 సంవత్సరానికి 3316 మంది నుంచి రూ.47.48 కోట్లు, 2027-28 సంవత్సరానికి 1008 మంది నుంచి రూ.17.07 కోట్లు, 2028-29 సంవత్సరానికి 264 మంది నుంచి రూ.3.76 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 14,411 మంది విద్యార్థుల నుంచి సుమారు రూ.250.2 కోట్లను వసూలు చేసినట్లు తేలింది. దాడుల సమయంలో రూ.10 లక్షల నగదు, రూ.4.89 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు కూడా ఈడీ తెలిపింది. సేకరించిన ఆధారాలపై ప్రాథమిక విశ్లేషణ చేస్తుండగా, భారీ స్థాయిలో నిధులను మళ్లించే పథకం నడిపినట్టు స్పష్టమవుతోందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది.