తహవ్వూర్ రాణాను తీసుకొచ్చిన విమానానికి డమ్మీ కోడ్ నేమ్... ఎందుకో తెలుసా?

Update: 2025-04-11 15:51 GMT
తహవ్వూర్ రాణాను తీసుకొచ్చిన విమానానికి డమ్మీ కోడ్ నేమ్... ఎందుకో తెలుసా?
  • whatsapp icon

How Tahawwur Rana extradited to India: తహవ్వూర్ రాణా... గత మూన్నాలుగు రోజులుగా ఈ పేరు లేకుండా వార్తలు ఉండటం లేదు. ఎందుకంటే, 2008 నుండి ఇండియా వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఈ రాణా. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాతో కలిసి ముంబైలో 2008 లో జరిగిన 26/11 ఉగ్రదాడుల్లో కీలక పాత్ర పోషించాడు.

ఉగ్రవాదులను సముద్ర మార్గం గుండా భారత్‌కు తరలించడంతో పాటు వారికి ఆయుధాలు సమకూర్చడం వరకు రాణా కీలకంగా వ్యవహరించాడు. లష్కరే తొయిబా సంస్థకే చెందిన మరో ఉగ్రవాద మాస్టర్ మైండ్ డేవిడ్ హెడ్లీతో కలిసి రాణా ఈ దాడులకు కుట్ర పన్నాడు. అందుకే రాణా కోసం ఇండియా అప్పటి నుండి గాలిస్తూనే ఉంది.

2020 లో అమెరికా రాణాను అరెస్ట్ చేసింది. రాణా అమెరికా పోలీసులకు దొరికాడు అని తెలుసుకున్న భారత్ అమెరికా సుప్రీం కోర్టులో ఎక్స్‌ట్రాడిషన్ పిటిషన్ దాఖలు చేసింది. కానీ హై ప్రొఫైల్ కేసు కావడంతో కేసు తీవ్రత దృష్ట్యా భారత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు ఇంత కాలం పట్టింది.

ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన సందర్భంగా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారత్‌కు కానుకగా రాణాను అప్పగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. "రాణా చేసిన తప్పుకు అతడికి భారత్‌లోనే శిక్ష పడటం కరెక్ట్ అవుతుంది" అని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

ఇలా ఐదేళ్ల కృషి తరువాత ఎట్టకేలకు రాణాను భారత్‌కు తరలించారు. రాణా తరలింపు సినిమాకు ఏ మాత్రం తీసిపోకుండా మొత్తం సినీ ఫక్కీలో జరిగింది.

పాకిస్థాన్ కు చెందిన రాణా లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ కోసం పనిచేశాడు. అందుకే రాణా తరలింపును అడ్డుకునేందుకు, అతడు భారత్ చేరకుండా చేసేందుకు అసాంఘీక శక్తులు ఏవైనా కుట్రలు పన్నే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావించింది. అలాంటి దాడులను తిప్పికొట్టే ప్లాన్ లో భాగంగా రాణాను తీసుకొస్తున్న ప్రత్యేక విమానం ఢిల్లీలోని పాలెం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యేంత వరకు కేంద్రహోంమంత్రిత్వ శాఖ, నేషనల్ సెక్యురిటీ ఏజెన్సీ ( NSA ), ఇంటెలీజెన్స్ బ్యూరో, ఎన్ఐఏ అనుక్షణం మానిటర్ చేశాయి. అంతేకాకుండా ఆ విమానాన్ని అసాంఘీక శక్తులు ట్రాక్ చేయడానికి వీల్లేకుండా Gulfstream G550 అని ఒక డమ్మీ కోడ్ నేమ్ కూడా పెట్టారు.

టెక్నాలజీ పెరిగిపోయిన ఈ రోజుల్లో విమానాలను రాకపోకలను ట్రాక్ చేసేందుకు అందరికీ అందుబాటులో కొన్ని ఇంటర్నెట్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా విమానాల పేర్ల సాయంతో విమానాలను ట్రాక్ చేస్తుంటారు. అసాంఘీక శక్తులకు ఇది అసలు పెద్ద పనే కాదు. అందుకే అలా కుట్రలు పన్నేవారిని బోల్తా కొట్టించడం కోసం రాణాను తీసుకొచ్చే విమానానికి ఒక డమ్మీ కోడ్ పెట్టారు. బుధవారం తెల్లవారిజామున అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో విమానం టేకాఫ్ అయింది. రూమేనియాలో ఇంధనం నింపుకునేందుకు చిన్న బ్రేక్ తీసుకున్నారు. మళ్లీ అక్కడి నుండి టేకాఫ్ అయిన విమానం గురువారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అయింది.

రాణా ఢిల్లీలో దిగడంతోనే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ( NIA ) అతడిని అదుపులోకి తీసుకుంది. రాణాను తరలించేందుకు స్వాట్ కమాండోల (SWAT commandos) సాయం తీసుకున్నారు. స్వాట్ కమాండోలు అంటే స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ అని అర్థం. ఎలాంటి ఉగ్రవాద దాడులనై తిప్పికొట్టేలా శిక్షణ పొందిన భద్రతా బలగాలే ఈ స్వాట్ కమాండోలు. 20 వాహనాలు ఉన్న కాన్వాయ్‌తో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి మరీ రాణాను తరలించారు. ఎన్ఐఏ కోర్టు రాణాకు 18 రోజుల కస్టడీ విధించింది.

Tags:    

Similar News