Corona Updates: గడిచిన 24 గంటల్లో కరోనా తో 138 మంది మృత్యువాత
Corona Updates: గడిచిన 24 గంటల్లో 138 మంది కరోనా మహమ్మారి కారణంగా మరణించడం ఆందోళన కలిగిస్తోంది.
Corona Updates: కంటి మీద కునుకు లేకుండా చేసిన కరోనా వైరస్ ప్రభావం దేశంలో మరోసారి తారా స్థాయికి చేరింది. గడిచిన 24 గంటల్లో 138 మంది మహమ్మారి కారణంగా మరణించడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 7.93లక్షల పరీక్షలు చేయగా..16,738 మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,46,914 కి చేరింది. కొత్తగా 11,799మంది కోలుకొన్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,07,38,501కు చేరి.. రికవరీ రేటు 97.25శాతంగా కొనసాగుతోంది.
10 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు..
కరోనా కేసులు పెరుగుతున్నతీరును పరిశీలించేందుకు 10 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను కేంద్రం పంపనుంది. ఈ బృందాలు మహారాష్ట్ర, కేరళ, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జమ్ము కాశ్మీర్ లో పర్యటించనున్నాయి. ఈ రాష్ట్రాల్లోనే కేసులు ఎందుకు ఒక్కసారిగా పెరుగుతున్నాయన్న విషయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించడమే లక్ష్యంగా టీమ్ లను ఏర్పాటు చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
నివేదిక ఆధారంగా....
ఆయా రాష్ట్రాల్లోని ప్రజారోగ్య శాఖ, జిల్లా, మండల స్థాయి అధికారుల సహకారంతో పాటు కొవిడ్ రెస్పాన్స్, మేనేజ్ మెంట్ టీమ్ లతో చర్చించి ఈ టీమ్ లు తమ నివేదికను సమర్పిస్తాయని, దాని ఆధారంగా తదుపరి నిర్ణయాలు ఉంటాయని కేంద్ర ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ మేరకు కేంద్రం నుంచి వచ్చే అధికారులకు సహకరించాలని పది రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖలు రాశామని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు.
యాంటీజెన్ పరీక్షలు తప్పనిసరి....
కరోనా బాధిత రాష్ట్రాల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షల వివరాల నుంచి ఎన్ని పరీక్షలు చేస్తే, ఎన్ని పాజిటివ్ లు వస్తున్నాయి? పాజిటివ్ రేషియో, కేసులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాల వివరాలు, అక్కడి కంటెయిన్ మెంట్ జోన్లు, తీసుకుంటున్న నియంత్రణా చర్యలన్నింటినీ అధికారులు సమీక్షిస్తారని తెలిపారు. కరోనా లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ యాంటీజెన్ పరీక్షలు తప్పనిసరని, ఈ పరీక్షల్లో నెగటివ్ వచ్చినా, జలుబు, జ్వరం వంటి లక్షణాలున్న వారికి ఆర్టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరని స్పష్టం చేశారు.
సజావుంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ...
గడిచిన 24 గంటల్లో 138 మంది ప్రాణాలు కోల్పోడంతో.. మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,56,705కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1,51,708కు చేరాయి. ఇక మరణాల రేటు 1.42 శాతంగా కొనసాగుతోంది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 5.03లక్షల మందికి టీకా ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం టీకా తీసుకొన్న వారి సంఖ్య 1,26,71,163కి చేరింది.