Pahalgam attack: చిన్నపిల్లలు భయపడుతున్నారు.. కశ్మీర్‌లో నివాసాల కూల్చివేత ఆపండి..!
Pahalgam attack: పహల్గాం ఘటన తర్వాత గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరమున్నా, చట్టపరమైన మార్గాల్లో న్యాయం సాధించాలని, అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని ఆయన సూచించారు.

Pahalgam attack: చిన్నపిల్లలు భయపడుతున్నారు.. కశ్మీర్‌లో నివాసాల కూల్చివేత ఆపండి..!
Pahalgam attack
Pahalgam attack: పహల్గాం ఉగ్రదాడి తర్వాత కశ్మీర్ లోయలో భద్రతా బలగాలు ఉగ్రవాదులపై చేపట్టిన కఠిన చర్యలు ముదిరి, అక్కడి ప్రజల్లో భయం నెలకొంది. ఉగ్రవాదులకు సంబంధించి ఉన్న ఇళ్లను ధ్వంసం చేస్తున్న ఈ ఆపరేషన్‌కు సంబంధించి పలువురు కశ్మీరీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరి అభిప్రాయం ప్రకారం ఈ చర్యలు అమాయక కుటుంబాలను, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయంటున్నారు.
ఇప్పటివరకు బందిపోరా, పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో ఉగ్రవాదులతో సంబంధం ఉన్న తొమ్మిది ఇళ్లను ధ్వంసం చేశారు. ఈ డెమోలిషన్స్ వల్ల సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ఇతర ప్రజల మధ్య కూడా తీవ్ర గందరగోళం ఏర్పడుతోంది.
హుర్రియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ మిర్వైజ్ ఉమర్ ఫారూక్ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ చర్యలపై తిరిగి ఆలోచించమని కోరారు. పహల్గాం దాడిని నిరసించడమే కాదు, నేరస్థులకు శిక్ష తప్పనిసరి అని చెబుతూ, అమాయక ప్రజలను టార్గెట్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
జమాఅతే ఇస్లామీకి చెందిన సీనియర్ నేత, జస్టిస్ డెవలప్మెంట్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు షమీమ్ అహ్మద్ తొకర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల ఇళ్లు పేల్చడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా భయంతో వణికిపోతున్నారని, మహిళలు, వృద్ధులు, పిల్లల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గాం ఘటన తర్వాత గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరమున్నా, చట్టపరమైన మార్గాల్లో న్యాయం సాధించాలని, అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని ఆయన సూచించారు.
ఏప్రిల్ 22న పహల్గాం బైసరన్ లోయలో జరిగిన ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. లష్కరే తోయిబాతో సంబంధాలున్న పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద గ్రూప్ ఈ దాడికి బాధ్యత వహించిందని భారత భద్రతా సంస్థలు వెల్లడించాయి. దాడి అనంతరం ఉగ్రవాదులు, వారిని మద్దతు ఇచ్చే ఒవర్ గ్రౌండ్ వర్కర్లను గుర్తించి గట్టి చర్యలు చేపట్టడం ప్రారంభించారు.
ఇక ఈ పరిణామాలతో కశ్మీర్ లోయలో భద్రతా చర్యలు మరింత కఠినతరం కాగా, ప్రజల భద్రతతో పాటు వారి మనోధైర్యం కాపాడేందుకు మరింత సమతూకం అవసరమని నాయకులు అభిప్రాయపడుతున్నారు.