Delhi Liquor Scam: సిసోడియాను విచారించాలని కస్టడీకి కోరిన సీబీఐ
Delhi Liquor Scam: కస్టడీని వ్యతిరేకిస్తూ వాదించిన సిసోడియా తరపు న్యాయవాది
Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో సిసోడియా కస్టడీపై తీర్పును రిజర్వ్ చేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. త్వరలోనే సీబీఐ వేసిన కస్టడీ పిటిషన్‌పై తీర్పు వెలువడే అవకాశాలున్నాయి. లిక్కర్ స్కామ్‌లో నిన్న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన సీబీఐ.. అతను దాటవేసే సమాధానాలు ఇచ్చారని అరెస్ట్ చేసింది. మరింత లోతుగా ప్రశ్నించాలంటూ సిసోడియాను కస్టడీకి కోరిన సీబీఐ.. ఆయన్ను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. అయితే రెండు వైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.
విచారణ సందర్భంగా లిక్కర్ స్కామ్‌లో సిసోడియాను లోతుగా విచారించాల్సి ఉందని సీబీఐ తరపున న్యాయవాది తెలిపారు. మనీష్ సిసోడియా అనేకసార్లు ఫోన్లు మార్చారన్న సీబీఐ తరపు న్యాయవాది.. నిందితులతో మాట్లాడిన సాక్ష్యాలను చెరిపేశారని ఆరోపించారు. లిక్కర్ పాలసీలో చివరి నిమిషంలో మార్పులు చేసి, నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు అప్పగించారన్నారు. లిక్కర్ పాలసీలో కమీషన్‌ను 5 నుంచి 12 శాతానికి కూడా పెంచారని కోర్టుకు తెలిపారు.
ఇక సిసోడియాను నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారంటూ వాదించారు ఆయన తరపు న్యాయవాది. ఇప్పటికే పలుమార్లు సీబీఐ చేసిన సోదాల్లో సిసోడియాకు వ్యతిరేకంగా ఆధారాలు లభించలేదని.. సిసోడియాను కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించారు.