
AC usage tips: ఏసీని ఇలా వాడితే కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది
How to use AC to get more cool in low power consumption: ఎండా కాలం ఉక్కపోత జనానికి పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. ఎండ వేడి నుండి తట్టుకునేందుకు ఏసీల వినియోగం భారీగా పెరిగిపోయింది. మంట గాలి, ఉక్కపోత వల్ల రాత్రి, పగలు అని తేడా లేకుండా ఏసీ వాడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. దాంతో ఉష్ణోగ్రతలు ఎలాగైతే మండిపోతున్నాయో చాలామందికి విద్యుత్ బిల్లు కూడా అదే స్థాయిలో మండిపోతోంది. విద్యుత్ బిల్లు పెరగడం ఒక్కటి చాలదన్నట్లుగా ఏసీలు కూడా పదేపదే మొరాయిస్తున్నాయి. అందుకే ఈ సమస్యలకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎనర్జి ఎఫిషియన్సీ బ్యూరో (Bureau of Energy Efficiency) ఏసీ వినియోగంపై పలు సలహాలు, సూచనలు చేసింది.
ఏసీలను ఎలా వినియోగిస్తే విద్యుత్ బిల్లు తక్కువ రావడంతో పాటు ఏసీలను చెడిపోకుండా ఎక్కువ కాలం వినియోగించవచ్చు అనే వివరాలను ఎనర్జి ఎఫీషియన్సీ బ్యూరో వెల్లడించింది. చాలామంది తక్కువ సమయంలో గదిని చల్లబర్చుకోవడం కోసం ఏసీ టెంపరేచర్ 18 లేదా 20 మధ్యలో పెడుతుంటారు. ఇంకొంతమంది అంతకంటే తక్కువ కూడా మెయింటెన్ చేస్తుంటారు. కానీ అలా చేయడం వల్ల త్వరగా చల్లబడకపోగా విద్యుత్ బిల్లు మాత్రం వాచిపోతుంది. ఎదుకంటే ఎంత తక్కువ టెంపరేచర్ లో ఏసీ నడిస్తే, ఏసీపై అంత అధిక భారం పడుతుంది. అలా అధిక భారం పడటం వల్ల కరెంట్ బిల్లు పెరుగుతుంది. అంతేకాకుండా ఏసీ లైఫ్ టైమ్ తగ్గిపోతుంది. ఒకవేళ ఏసీ మెషిన్ పాతదయితే, అంత లోడ్ తట్టుకోలేక అది రిపేర్ కు వచ్చే అవకాశం కూడా ఉంది.
ఎనర్జి ఎఫిషియన్సీ బ్యూరో వెల్లడించిన వివరాల ప్రకారం ఏసీలను 24 డిగ్రీలు లేదా అంతకంటే కొంచెం ఎక్కువ టెంపరేచర్ లో ఏసీలను వాడాలి. అలా చేయడం వల్ల సంవత్సరానికి సగటున రూ.6,240 విద్యుత్ బిల్లు ఖర్చు ఆదా అవుతుందని ఎనర్జి ఎఫిషియన్సీ బ్యూరో ప్రకటించింది. అంటే నెలకు ఎంత లేదన్నా కాస్త అటుఇటుగా రూ. 500 వరకు కరెంట్ బిల్లు తగ్గించుకోవచ్చు అన్నమాట. పైగా ఏసీల జీవితకాలం పెరుగుతుంది. అన్నింటికి మించి మీ ఆరోగ్యం కూడా దెబ్బతినకుండా ఉంటుందని ఎనర్జి ఎఫిషియన్సీ బ్యూరో ఆ ప్రకటనలో పేర్కొంది.
దేశంలో అందరూ ఇలానే ఏసీలను 24 డిగ్రీల వద్ద ఉపయోగిస్తే దేశానికి ఈజీగా 23 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది అని ఎనర్జి ఎఫిషియన్సీ బ్యూరో చెబుతోంది. ఏసీల వినియోగంపై జనంలో అవగాహన కల్పించే లక్ష్యంతో ఎనర్జి ఎఫిషియన్సీ బ్యూరో ఈ ప్రయత్నం చేసింది. మరి మీరు కూడా ఏసీని ఇలానే ఉపయోగిస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. లేదంటే బిల్లు వాచిపోవడం ఒక్కటే కాదు... హెల్త్ ప్రాబ్లమ్స్, ఏసీ రిపేర్ లాంటి సమస్యలు తప్పవు.