Mystery News: ఆ గ్రామంలో చేతబడులు? తలవెంట్రుకులు ఊడిపోతున్నాయ్.. గోర్లు తెగిపోతున్నాయ్..

ఆ గ్రామం ఓ మిస్టరీ..! అక్కడ అందరి తలవెంట్రుకలు ఊడిపోతున్నాయ్! చిన్నారుల నుంచి వృద్ధుల వరకు చాలా మంది అక్కడ గుండుతోనే కనిపిస్తున్నారు. రోజులు గడుస్తున్నాయ్.. నెలలు దాటుతున్నాయ్.. దీనికి కారణమేంటో ఇప్పటివరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. తలపండిన మేధావులు సైతం ఈ తలవెంట్రుకుల మిస్టరీని ఛేదించలేకపోతున్నారు..! రోజూ ఆ గ్రామానికి డాక్టర్లు వస్తున్నారు..శాంపిల్స్ తీసుకుంటున్నారు.. వెళ్తున్నారు..! అయినా రిజల్ట్ మాత్రం బిగ్ జీరో..! ఇప్పటికీ జుట్టు ఊడిపోతున్నా కేసులు రికార్డువుతున్నా.. కొత్త లక్షణాలు పుట్టుకొస్తున్నా.. సమాధానాలు మాత్రం శూన్యం.. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతోంది? అందరి తలవెంట్రుకలు ఎందుకు ఊడిపోతున్నాయ్? ఈ గుండు గ్రామం వెనుక ఉన్న అసలు కథేంటి?
మహారాష్ట్ర-బుల్ధానా జిల్లాలో ఉన్న బాండ్‌గావ్ అనే చిన్న గ్రామం గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. జనవరి మొదటివారం నుంచి అక్కడ వింత ఘటనలు జరగడం మొదలయ్యాయి. మొదట ముగ్గురు మహిళలు తమ జుట్టు ఊడిపోవడాన్ని గుర్తించారు. ఏదో చిన్న సమస్యలే అని లైట్ తీసుకున్నారు. కానీ రెండు రోజుల్లోనే ఆ ఊరిలో 35 మంది అదే లక్షణాలతో బయటపడ్డారు. వారం రోజుల్లోనే ఇదే తరహా లక్షణాలు సరిహద్దు గ్రామాల్లోనూ కనిపించాయి. 10 రోజులు తిరగేలోపే మొత్తం 18 గ్రామాల్లో 400 మందికిపైగా కేసులు రికార్డయ్యాయి. రాత్రి నిద్రపోయే ముందు జట్టు ఉంటుంది.. ఉదయం లేచే సరికి జుట్టు మొత్తం ఊడిపోయి ఉంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ అందరికీ ఇలానే జరిగింది. మొదట ఓ షాంపూ వల్లనేమో అనుకున్నారు.. కానీ శాంపిల్స్ తీసుకున్న డాక్టర్లు, శాస్త్రవేత్తలు ఈ సమస్య సాధారణం కాదని స్పష్టం చేశారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఏయిమ్స్, హైదరాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ లాంటి దేశంలోని అత్యున్నత వైద్య, శాస్త్రీయ సంస్థలు బాండ్‌గావ్‌కి చేరకుకున్నాయి. అక్కడ మట్టి, నీరు, జుట్టు, రక్తం, మూత్రం వరకు అన్ని శాంపిల్స్ సేకరించాయి. కొన్ని పరిశీలనల తర్వాత గోధుమల్లో సెలీనియం అనే మినరల్ స్థాయిలు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఆ గోధుమలు పంజాబ్, హర్యానా నుంచి వచ్చినట్టుగా భావించారు. కొన్ని శరీర పరీక్షల్లో సెలీనియం స్థాయి 600 రెట్లు అధికంగా ఉందన్న నివేదికలు వచ్చాయి. కొన్ని శరీరాల్లో జింక్ స్థాయి తక్కువగా ఉన్నట్లు కూడా గుర్తించారు. కానీ ICMR శాస్త్రవేత్తలు మాత్రం ఇది సెలీనియం కారణంగానే జరుగుతుందని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవన్నారు. ఇదంతా జరుగుతున్న సమయంలో ఊరిలో మరో ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఊర్లో చాలా మందికి కొత్త కొత్త లక్షణాలు కనపడడం ప్రారంభించాయి. తలపై పుండ్లు, వేధించే నొప్పులు, కళ్లదగ్గర మచ్చలు, బరువు తగ్గిపోవడం లాంటి ఆరోగ్య సమస్యలతో అక్కడి ప్రజలు నరకం అనుభవించారు.
ఈ బాధ కేవలం శారీరకంగానే కాదు మానసికంగానూ ఆ ఊరిని చీల్చేసింది. సమస్య మొదలైన నాటి నుంచి పెళ్లిళ్లు ఆగిపోయాయి. ఉదాహరణకు ఓ వరుడు రెండు రోజుల వ్యవధిలో గుండుగా మారిపోవడంతో అతడిని వధువు వదిలేసి వెళ్లిపోయింది. అటు నిత్యం ప్రయాణిస్తూ.. గ్రామం నుంచి పట్టణాలకు వెళ్లి చదువుకునే స్కూల్ పిల్లల దుస్థితి మరింత దయనీయంగా మారింది. జుట్టు ఊడిపోయిన పిల్లలను చూసి తొటి ఫ్రెండ్స్ నవ్వుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ గ్రామస్తులు బయటకి వెళ్లాలంటేనే భయపడే స్థితి నెలకొంది. జుట్టు ఊడిపోయిన వాళ్లు ముఖానికి క్లాత్ కప్పేసుకొని తిరుగుతున్నారు. ఈ తరహా బాధితులు ఉన్న ఇంటికి ఎవరూ వెళ్లడంలేదు. అక్కడ మంచినీరు కూడా ముట్టుకోవడంలేదు. అటు బయటవాళ్ల సూటి పోటు మాటలతోనే కాదు... అద్దంలో తల చూసుకున్నప్పుడు వాళ్లకు వాళ్లే తట్టుకోలేకపోతున్నారు.
ఇదంతా జరుగుతున్న టైంలో ఊరిలో ఒక్కసారిగా అపోహలు, ఊహలు మొదలయ్యాయి. ఎవరికి వారే తమవారి జుట్టు ఊడిపోవడాన్ని విశ్లేషించుకుంటున్నారు. కొంతమంది ఇదంతా దేవుడి శాపంతోనే జరుగుతుందని గుళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇంకొందరైతే దీన్ని బ్లాక్ మ్యాజిక్‌గా నమ్ముతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు తలపై చేతులు వేసుకోవాలంటేనే హడలిపోతున్నారు. తల వెంట్రుకలు నేలపై కనిపిస్తే ఏదో తెలియని భయం, అనుమానం వెంటాడుతోంది. కొంతమంది మాత్రం ఇది గత జన్మ పాపాల ఫలితమని.. దీనికి బాధపడక తప్పదని వేదాంతం వల్లిస్తున్నారు. ఇలా ఒక్కో ఇంట్లో ఒక్కో అభిప్రాయం.. కానీ ఎవరికీ స్పష్టత లేదు. ఈ మధ్య కాలంలో కొంతమంది తలపై నూనె రాసుకోవడమూ మానేశారు. అటు ఈ మిస్టరీని ఛేదించేందుకు సైన్స్ ఎంత ప్రయత్నించినా.. సమస్యకు మూలాలు మాత్రం అంతుబట్టడంలేదు. ఇక ఒకటి మాత్రం నిజం.. బాండ్‌గావ్ ఇప్పుడు ఒక్క ఊరు కాదు. అది దేశాన్ని వేధిస్తున్న ఓ ప్రశ్న.. సమాధానం మాత్రం ఇంకా శూన్యం..!