Pushpa 2 Review: ఏముంది ఇందులో?

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కిన తాజా చిత్రం పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ చేశారు.

Update: 2024-12-04 21:37 GMT

Pushpa 2 movie review and rating in telugu: అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కిన తాజా చిత్రం పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ చేశారు. పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసి ఈ సినిమా చేసినట్లు ముందు నుంచి ప్రచారం జరిగింది. ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటించిన ఈ చిత్రం మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచేలా సినిమా ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్‌లో చేసింది. పాటలు కూడా సూపర్ హిట్ కావడంతో సినిమా ఎలా ఉంటుందా అని అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. మరి అలాంటి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు చూద్దాం పదండి.

పుష్ప ది రూల్ స్టోరీ ఏంటంటే

ఎర్రచందనం కూలీగా ప్రస్థానం మొదలుపెట్టిన పుష్పరాజ్ సిండికేట్ పెద్ద స్థానానికి వెళ్తాడు. పెళ్లయ్యాక భార్యతో సరదా సరదాగా సాగిపోతున్న జీవితాన్ని ఒక ఫోటో మార్చేసింది. ఊరికి వచ్చిన సీఎంని కలవడానికి పుష్పరాజు వెళ్తుంటే భార్య సరదాగా సీఎంతో ఫోటో దిగి రండి మన హాల్లో పెట్టుకుందాం బాగుంటుంది అని అడుగుతుంది. సీఎంతో ఫోటో దిగడానికి ప్రయత్నిస్తే ఇలాంటి స్మగ్లర్ల నుంచి డబ్బులు తీసుకుంటాను కానీ ఫోటోలు దిగలేం అంటూ అవమానిస్తాడు. దానికి తోడు భార్య గురించి పుష్పకు నచ్చని మాట మాట్లాడడంతో ఆ సీఎంని మార్చేస్తే పోలా అనే ఆలోచనకు వస్తాడు. అందుకు ఎంత ఖర్చవుతుందో సిద్ధప్ప (రావు రమేష్) చెప్పగా అందుకు సిద్ధమైపోతాడు సీఎంను మార్చాలని భావించి ఒక పెద్ద ఇంటర్నేషనల్ డీల్ సెట్ చేస్తాడు. అలా చేసేందుకు ప్రయత్నించిన పుష్పరాజ్ ప్రయత్నాలు ఫలించాయి. అయితే పుష్పరాజు సీఎంను మార్చేందుకు ఎంతవరకు సక్సెస్ అయ్యాడు? ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న ఫహద్ ఫాజిల్ పుష్పరాజును అడ్డుకునేందుకు ఏం చేశాడు? పుష్పరాజ్ షెఖావత్‌ను ఎలా అడ్డు తొలగించుకున్నాడు? చివరికి పుష్ప రాజ్ ఇంటిపేరు సంపాదించగలిగాడా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:

కథగా చెప్పుకోవాలంటే ఈ సినిమాలో పెద్దగా కథ ఏమీ లేదు. ఇంటిపేరు కూడా లేకుండా అవమానాలు పడే పుష్పరాజ్ ఆ ఇంటి పేరుని ఎలా దక్కించుకున్నాడు? తన కుటుంబానికి ఎలా దగ్గరయ్యాడు? ఆ దగ్గరయ్యే క్రమంలో జరిగిన అవమానాలు ఏంటి? లాంటి విషయాలను చాలా చిన్న లైన్‌ని మూడు గంటల 20 నిమిషాల సినిమాగా మలిచాడు సుకుమార్. కథగా చెప్పుకోవడానికి ఏమీ లేదు కానీ ఎమోషన్స్‌తో, హై మూమెంట్స్‌తో నింపేశారు. సినిమా ఓపెనింగ్ షార్ట్ నుంచి క్లైమాక్స్ ఎండ్ కార్డు వరకు ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. తల పక్కకు తిప్పితే ఏ షాట్ మిస్ అవుతామో? అన్నట్టుగా యాక్షన్ సీక్వెన్స్‌లు, డాన్సులు, చేజింగ్ సీన్స్ వంటి వాటితో సుకుమార్ ఒక రకమైన మ్యాజిక్ చేశాడు. అలా అని సినిమాలో వంక పెట్టడానికి ఏమీ లేదా అనుకుంటే అది మీ పొరపాటే. రష్మిక క్యారెక్టరైజేషన్ చాలామందికి నచ్చదు. అలాగే సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు ఏమీ జరగకుండా ఏదో సూపర్ మాన్ లాగా ఫైట్ చేస్తూ వెళ్లడం కూడా లాజిక్స్‌కి కాస్త దూరంగానే అనిపిస్తుంది. అయినా సరే కాసేపటికి ఒకసారి ప్లాన్ చేసుకున్న హై మూమెంట్స్‌తో అ లాజిక్స్ సంగతి ఆలోచించకుండా చేశాడు. ఆ విషయంలో సుకుమార్ మ్యాజిక్ పనిచేసింది.

నటీనటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే..

ఇక నటీనటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే అల్లు అర్జున్ వన్ మాన్ షో చేశాడు. మొదటి భాగానికి నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ రెండో భాగంలో తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ముఖ్యంగా జాతర సీక్వెన్స్‌లో చేసిన డాన్స్‌తో పాటు క్లైమాక్స్ ఫైట్ అద్బుతంగా కుదిరింది. ఇక రష్మిక శ్రీవల్లి అనే పాత్రలో పరకాయ ప్రవేశం చేసిందని చెప్పాలి. క్రాక్ పోలీస్ ఆఫీసర్‌గా ఫహద్ ఫాజిల్ తన పాత్రకి పూర్తిస్థాయి న్యాయం చేశాడు. ఇక మిగతా పాత్రధారులు జగపతి బాబు, అనసూయ, సునీల్, రావు రమేష్ కేశవ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

పుష్ప 2 టెక్నికల్ టీమ్ వర్క్ ఎలా ఉందంటే..

టెక్నికల్ టీం విషయానికొస్తే సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. అలాగే సినిమాటోగ్రఫీ సినిమా మొత్తాన్ని ఒక దృశ్య కావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సక్సెస్ అయింది. సినిమాటోగ్రఫీ కారణంగా చాలా ఫ్రేమ్స్ బాగా కుదిరాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆర్ట్ వర్క్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా నిడివి ఎక్కువగా ఉన్నప్పటికీ ఎక్కడా సాగదీసిన ఫీలింగ్ లేకుండా, బోర్ కొట్టిన ఫీలింగ్ రాకుండా కట్ చేసిన ఎడిటర్ పనితనం కూడా బావుంది.

హెచ్ఎంటీవీ వర్డిక్ట్ పుష్ప గాడి ఊచకోతకు బాక్స్ ఆఫీస్ రప రప

పుష్ప 2 మూవీ రేటింగ్ : 3.25 / 5

Tags:    

Similar News