Manchu Family Feud: నేడు సీపీ ముందుకు మంచు ఫ్యామిలీ..విచారణకు హాజరుకావాలని మోహన్ బాబు, మనోజ్, విష్ణుకు నోటీసులు

Update: 2024-12-11 01:01 GMT

Manchu Family Feud: ప్రముఖ నటుడు మోహన్ బాబు ఇంటి వివాదం రచ్చకెక్కింది. తండ్రీ కొడుకుల మధ్య వైరుధ్యాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత వరకు వెళ్లాయి. ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. మీడియా ముందుకు వచ్చి విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. చిత్ర పరిశ్రమలో మంచి పేరున్న కుటుంబంలో ఇలాంటి గొడవలు రావడం ఏమాత్రం మంచిది కాదని పలువురు అంటున్నారు. కానీ ఇప్పుడు పరిస్ధితి మాత్రం పూర్తిగా అదుపుతప్పినట్లు కనిపిస్తోంది. ఎవరికి వారు తమకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. మంగళవారం రాత్రి జల్ పల్లిలో మీడియాపై మోహన్ బాబు మండిపడటం..ఓ ఛానెల్ కెమెరామెన్ పై చేయి చేసుకోవడం కూడా తీవ్ర కలకలం రేపుతోంది.

ఈ నేపథ్యంలో మోహన్ బాబుకు రాచకొండ సీపీ సుధీర్ బాబు నోటీసులు పంపించారు. మీడియాపై చేయి చేసుకోవడంతో పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. నేడు ఉదయం 10.30కి మోహన్ బాబు, మనోజ్, విష్ణు విచారణకు రావాలని సీపీ ఆదేశించారు. జల్ పల్లి దాడి ఘటనపై విచారణకు ఆదేశించారు పోలీసులు. మరోవైపు ఫిలింనగర్ పోలీసులు, మోహన్ బాబు, మంచు విష్ణు దగ్గర ఉన్న లైసెన్డ్ గన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో నేడు ఏం జరుగుతుందనేది మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ దాడిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. గాయపడిన రంజిత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. అటు ఆస్తుల వివాదంపై ఆదివారం మనోజ్ పై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. తాను ఇంట్లో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి తనపై దాడి చేశారని మనోజ్ కూడా పహాడీ షరీఫ్ పీఎస్ లో కేసు పెట్టారు. ఇలా ఇద్దరూ ఆదివారం కేసులు పెట్టుకోవడం హాట్ టాపిగ్గా మారింది.

విదేశాల నుంచి మంచు విష్ణు వచ్చి స్వయంగా మోహన్ బాబు ఎయిర్ పోర్టు నుంచి తీసుకువచ్చారు. ఆ తర్వాత కుటుంబంలో చర్చలు జరిగాయి. అయినా ఎలాంటి ఫలితం లేదు. దాంతో భార్య సహా, మనోజ్ ఇంటిని బయటకు వచ్చి..అడిషనల్ డీజీపీని కలిశారు. ఆ తర్వాత మళ్లీ మనోజ్ తన ఏడు నెలల కూతురుని తెచ్చుకునేందుకు జల్ పల్లిలోని ఇంటికి వెళ్లాడు. అప్పుడే ఆయనపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. చిరిగిన చొక్కాతో బయటకు వచ్చారు. భద్రతా సిబ్బంది ఆయనపై దాడికి పాల్పడి ఉంటారని తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలని మనోజ్ భార్య మౌనిక కోరారు.

మొత్తానికి ఈ పంచాయతీ కాస్త ఇప్పుడు రాచకొండ సీపీ సుధీర్ బాబు వద్దకు చేరుకుంది. నేడు మోహన్ బాబుతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. 

Tags:    

Similar News