Nootokka Jillala Andagadu Review: నూటొక్క జిల్లాల అందగాడు రివ్యూ
తెలుగు సినిమా ప్రేక్షకులకి "ఊహలు గుస గుస లాడే" వంటి మంచి హ్యుమర్ తో ఉన్న ప్రేమ కథని అందించిన అవసరాల శ్రీనివాస్
Nootokka Jillala Andagadu Movie Review: తెలుగు సినిమా ప్రేక్షకులకి "ఊహులు గుస గుస లాడే" వంటి మంచి హ్యుమర్ తో ఉన్న ప్రేమ కథని అందించిన అవసరాల శ్రీనివాస్ చాలా రోజుల తరువాత మళ్ళి "నూటొక్క జిల్లాల అందగాడు" అనే సినిమా ని రాసి, నటించి, తన స్నేహితుడు అయిన రాచకొండ విద్యాసాగర్ ని దర్శకుడి గా పరిచయం చేస్తూ సినిమా చేసాడు. బట్టతల అనే అంశం మీద రూపొందిన ఈ సినిమా టీజర్ దగ్గర నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. మరి దర్శకుడు క్రిష్ నచ్చి మెచ్చి నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకుల మెప్పించింద లేదా అనేది చూద్దాం.
చిత్రం: నూటొక్క జిల్లాల అందగాడు
నటీనటులు: అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ తదితరులు
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
సినిమాటోగ్రఫీ: రామ్
ఎడిటింగ్: కిరణ్ గంటి
నిర్మాతలు: శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి
దర్శకత్వం: రాచకొండ విద్యాసాగర్
బ్యానర్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్
విడుదల: 03/09/2021
కథ:
సాధారణంగా ఈ కాలం అబ్బాయిల్లో ఎక్కువగా ఉండే బాధ జుట్టు రాలిపోతుంది అని, అలాగే బట్టతల వస్తుందేమో అని, ఇక ఆల్రెడీ బట్టతల వచ్చిన యువకులు అయితే అందరిలో ఎక్కువ కలవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి ఒక అబ్బాయే గుత్తి సూర్యనారాయణ(అవసరాల శ్రీనివాస్) ఇతనికి బట్టతల పెద్ద సమస్య, బట్టతల ఉంది అనేది ఎవరికీ తెలియకుండా విగ్గుతో కవర్ చేసుకుంటూ ఉంటాడు. తను ఎక్కడికి వెళ్ళిన కూడా ఆ విగ్గు ని మాత్రం వదిలిపెట్టడు. ఇలాంటి ఒక అబ్బాయి పని చేసే ఆఫీస్ లో అంజలి(రుహని శర్మ) అనే అమ్మాయి జాయిన్ అవుతుంది.
అంజలి ని చుసిన వెంటనే ప్రేమలో పడిపోతాడు గుత్తి. కానీ ఆ అమ్మాయి దగ్గర తనకి బట్టతల ఉంది అనే విషయాన్నీ దాచి మరి ఆ అమ్మాయిని ప్రేమిస్తుంటాడు గుత్తి. కానీ పరిస్థితులు అందరికి ఒకేలాగా ఉండవు కదా అందుకే ఒక రోజు అంజలికి గుత్తికి ఉన్న బట్టతల విషయం గురించి తెలిసిపోతుంది. ఆ విషయం తెలిసాక అంజలి ఎలా రియాక్ట్ అయ్యింది ? అసలు గుత్తి ప్రేమ ఫలించిందా లేదా అనేది మిగిలిన కథ.
నటీనటులు
ముందుగా నటన గురించి మాట్లాడుకుంటే అవసరాల శ్రీనివాస్ చేసిన గుత్తి పాత్ర గురించి మాట్లాడుకోవాలి, అసలు ఈ పాత్రకి అవసరాల శ్రీనివాస్ తప్ప ఎవరు సెట్ అవ్వలేరు అనే రీతిలో శ్రీనివాస్ పెర్ఫార్మన్స్ ఉంది. జీవితం లో అస్సలు కాంఫిడెన్స్ లేని ఒక వ్యక్తీ పాత్రలో ఒదిగిపోయాడు అవసరాల శ్రీనివాస్. గుత్తి సూర్య నారాయణ అనే యువడుకి పాత్ర మన నిజజీవితం లో కూడా ఎక్కడో ఒక దగ్గర ఉండే ఉంటుంది అనే రేంజ్ లో నటించి ఆ పాత్రని మనకి కనెక్ట్ అయ్యేలా చేసాడు అవసరాల శ్రీనివాస్.
ఇకపోతే చక్కటి అర్బన్ అమ్మాయి పాత్రలో రుహని శర్మ మెప్పించింది. రుహని శర్మ కి ఈ కథలో మంచి పాత్రే దక్కిన కూడా అవసరాల శ్రీనివాస్ చేసిన గుత్తి సూర్య నారాయణ పాత్రే ప్రేక్షకులకి గుర్తుండి పోతుంది. అలాగే సినిమాలో అడపాదడపా వచ్చే రోహిణి, రమణ భరద్వాజ్లు తమ పాత్రల వరకు పరవాలేదు అనిపించారు. రోహిణి పాత్రకి ఇంకాస్త ఎక్కువ నిడివి ఉండి ఉంటె రోహిణి తన నటనతో కథకి ఇంకాస్త ఎమోషనల్ టచ్ తీసుకొచ్చేవారు అనే భావన ప్రేక్షకుల్లో కలగక మానదు.
సాంకేతికవర్గం
బట్టతల వల్ల ఇబ్బంది పడే ఒక యువకుడి కథని మనకి చెప్పాలి అనే ఐడియా వచ్చిన అవసరాల శ్రీనివాస్ ని మనం ముందుగా మెచ్చుకోవాలి, కానీ ఇంత మంచి కథ పెట్టుకొని పసలేని కథనం తో సినిమాని సాగదీసాడు అనిపిస్తుంది. కథనం అనేది కొంచెం ఆసక్తిగా ఉండి ఉంటే బాగుండేది అనిపించింది. దర్శకుడు విద్యాసాగర్ కి ఇది మొదటి సినిమా అయిన కూడా సన్నివేశాలన్నీ బాగా తెరకెక్కించాడు. ఇక పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఈ సినిమా కి రామ్ అందించిన తన కెమెరా పనితనం సినిమా క్వాలిటీని ఒక మెట్టు ఎక్కించింది. కొన్ని సన్నివేశాల్ని అయితే రామ్ ఎక్కడ రాజీపడకుండా తీసి సినిమాకి బలాన్ని అందించాడు అనీ చెప్పుకోవచ్చు. ఎడిటర్ కిరణ్ సినిమాలోని కొన్ని సన్నివేశాల్ని షార్ప్ గా కట్ చేసి ఉంటే బాగుండేది. ఇకపోతే అవసరాల శ్రీనివాస్ మాత్రం కథకుడిగా ఈ సినిమా పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే శ్రీనివాస్ ఖాతాలో మరో మంచి చిత్రంగా ఈ సినిమా నిలిచేది.
బలాలు:
అవసరాల శ్రీనివాస్ నటన
కొన్ని కామెడీ సీన్స్
బలహీనతలు:
స్క్రీన్ ప్లే
సాంగ్స్, మ్యూజిక్
ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడం
తీర్పు:
బట్టతల వల్ల సమాజం లో ఇబ్బంది పడే ఎంతో మంది అబ్బాయిల కథ ఇది. కథ బాగున్నా కూడా కథనం ఈ సినిమాకి మైనస్ గా మారింది. హీరో హీరోయిన్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు బాగున్న కూడా మిగతా చోట్ల ఎక్కడా కూడా కామెడీ అనేది పేలలేదు. సో ఫైనల్ గా చూసుకుంటే ఎటువంటి ఎమోషనల్ కనెక్ట్ లేని గుత్తి సూర్యనారాయణ కథని మనం ఒక్కసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా చుసేయొచ్చు.
బాటమ్ లైన్:
ఈ నూటొక్క జిల్లాల అందగాడిని ఒక్కసారి మాత్రమే చూడొచ్చు.