
Rare Snake: ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవులు, గడ్డి భూముల్లో ఎన్నో జాతుల పాములు నివసిస్తుంటాయి. వీటిలో కొన్ని అరుదైనవి ఉంటాయి. తాజాగా ఇండియాలో అలాంటి అరుదైన జాతి పామును శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని అహేతుల్లా లాంగిరోస్ట్రిస్ లేదా వైన్ స్నేక్ అని పిలుస్తుంటారు. ఇది యూపీలో ఈ పాము కనిపించడం రెండోసారి. గతంలో బీహార్ లో ఒకసారి మాత్రమే ఈ జాతి సర్పం కనిపించింది.
దుధ్వాటైగర్ రిజర్వ్ లోని పాలియా ఖేరి ప్రాంతంలో ఓ ఖడ్గమ్రుగాన్ని విడిచిపెడుతున్న సమయంలో ఈ జాతి పాము అటవీశాఖ అధికారులకు కనిపించింది. ఖడ్గమ్రుగం ఇక్కడ సేఫ్ గా ఉండేందుకు కార్మికులు సమీపంలోని చెదపురుగుల పుట్టను తొలగిస్తున్నారు. ఒక యంత్రం ఆ దిబ్బను తాకినప్పుడు అకుపచ్చరంగులో ఉన్న పాము బయటకు వచ్చింది. దాన్ని చూసిన వెంటనే అక్కడివారంతా ఆశ్చర్యపోయారు.
వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ టీమ్ మెంబర్స్ విపిన్ కపూర్ సైని, అపూర్వ గుప్తా రోహిత్ రవి , శుశాంత్ సింగ్ ఈ పామును రక్షించారు. దాన్ని సమీపంలోని మరొక చెదపురుగుల పుట్టలో వదిలిపెట్టారు. అక్కడ అది సురక్షితంగా సౌకర్యవంతంగా ఉండేలా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. దాని నివాస స్థలాన్ని కదిలించుకుండా ఉండాలని నిర్ణయించారు. పాములను అధ్యయనం చేసే ప్రక్రుతి పట్ల శ్రద్ధ వహించే వ్యక్తులకు ఈ అన్వేషణ చాలా కీలకం.
పొడవైన ముక్కుతో ఉన్న వైన్ స్నేక్ చాలా అరుదు అయ్యింది. దీన్ని మొదటిసారి 2021లో బీహార్ లోని వాల్మీకి టైగర్ రిజర్వ్ లో చూశారు. ఇద్దరు శాస్త్రవేత్తలు సౌరభ్ వర్మ, సోహమ్ పట్టేకర్ కు చనిపోయిన పాము కనిపించింది. ముందు దాన్ని ఐడెంటిఫై చేయలేదు. దీంతో డీఎన్ఏ పరీక్షించి అధ్యయనం చేశారు. 2024లో ఇది ఒక కొత్త రకమైన వైన్ స్నేక్ అని చెబుతూ ఒక రిపోర్టును ప్రచురించారు. ఇప్పుడు దుధ్వాలో సజీవంగా ఉన్న వైన్ స్నేక్ కనిపించడం అద్భుతమని చెబుతున్నారు.