లోక్‌సభలో గులాబీ గళం వినిపించేదెవరు? ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా కేసీఆర్ ఎవర్ని నియమించబోతున్నారు? సీనియర్ నేతల ఓటమితో ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ నేతను ఎంపిక చేసే పనిలో పడ్డారు గులాబీ బాస్. తమ పార్టీ తరఫున ఉన్న 9మంది ఎంపీల బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుని, అందులో ఒకరిని ఎంపిక చేయనున్నారు కేసీఆర్.
పార్లమెంటులో తెలంగాణ వాయిస్ వినిపించేందుకు నేతలు కరువయ్యారు. ఇప్పటి వరకూ గళం వినిపించిన నేతల్లో కొందరు ఓడిపోగా, మరికొందరు పార్టీని వీడిపోయారు. దీంతో పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థుల్లో ఎవరికి సమర్ధత ఉందన్నదానిపై కసరత్తు చేస్తున్నారు గులాబీ బాస్.
గత లోక్‌సభలో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా వ్యవహరించిన జితేందర్‌రెడ్డి తనకు ఎంపీ టిక్కెట్టు రాకపోవడంతో బీజేపీ గూటికి చేరారు. అటు నిజామాబాద్‌లో కవిత, కరీంనగర్‌లో బి.వినోద్‌కుమార్ ఓడిపోవడంతో పార్టీకి ఇబ్బందిగా మారింది. గత లోక్‌సభలో ఎంపీలుగా కవిత, బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రొఫెసర్ సీతారాం నాయక్, బాల్క సుమన్ ఉండగా ఈసారి అంత సామర్ధ్యం ఉన్న నేతలెవరూ కనిపించడం లేదు.
అయితే, ప్రస్తుత పరిణామాలతో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కొనసాగనున్నట్టు తెలుస్తోంది. ఈసారి గెలిచిన 9మంది ఎంపీల్లో ఒకరికి లోక్‌సభాపక్ష నేత, మరొకరికి ఉపనేత పదవులు దక్కనున్నాయి. దీంతో రెండోసారి ఎంపీగా ఎన్నికైన వారిని ఎంపీక చేసేపనిలో ఉన్నారు కేసీఆర్. ఆ జాబితాలో కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, కొత్తగా పార్టీలో చేరి ఎంపీ అయిన నామా నాగేశ్వరరావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
అయితే, బీబీ పాటిల్‌కు సరైన వాగ్ధాటి లేకపోవడం మైనస్ కాగా, కొత్త ప్రభాకర్‌రెడ్డికి భాషా సమస్య ఉంది. అదీగాక ఆయన హరీష్‌రావు వర్గానికి చెందిన నేత అనే అవరోధాలున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇక నామా నాగేశ్వరరావు విషయానికొస్తే ఆయన గతంలో టీడీపీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేతగా పనిచేసిన అనుభవం ఉంది. అయితే, కొత్తగా పార్టీలోకి వచ్చిన వ్యక్తికి పదవి అప్పగిస్తే పార్టీ శ్రేణుల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు కేసీఆర్. మరి టీఆర్ఎస్ తరఫున ఎంపీలుగా గెలిచిన 9మందిలో లోక్‌సభాపక్ష నేతగా కేసీఆర్ ఎవరిని నియమిస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. కేసీఆర్ మరి ఎవర్ని ఎంపిక చేస్తారో చూడాలి.