ఎమ్మెల్యేగా డీమోట్.. ఎంపీగా ప్రమోట్

Update: 2019-05-24 08:50 GMT

ఎన్నికల్లో ఎదురుగాలి వీస్తే ఎంతటి గొప్పనాయకులైనా ఓటమి చవిచూడాల్సిందే. ఆ ఓటమి నుంచి తేరుకొని కొద్ది కాలంలోనే మళ్లీ విజయం సాధిస్తే!! ఇదే కొందరి నాయకుల విషయంలో నిజమైంది. ప్రజల్లో వారికున్న పట్టుకు నిదర్శనంగా చూపింది. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలే అందుకు ఉదాహరణ. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన పలువురు ప్రముఖ నేతలు మళ్లీ స్వల్ప వ్యవధిలోనే పుంజుకుని ఎంపీ అభ్యర్థులుగా పోటీచేసి గెలుపొందడం విశేషం.

రేవంత్‌రెడ్డి. కొడంగల్‌ ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున రెండు సార్లు గెలుపొంది ఫైర్‌బ్రాండ్‌ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 2018 డిసెంబరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి భారీ తేడాతో ఓటమి చవిచూశారు. అయినా పట్టువీడకుండా అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రభుత్వంపై విరుచుకుపడుతూ తన వాణిని బలంగా వినిపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగే సత్తా ఉన్న నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో కొడంగల్‌ ఎమ్మెల్యేగా ఓటమి చవిచూసినా మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థిగా విజయం సాధించారు.

కోమటిరెడ్డి. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్‌గా వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌ తరఫున నల్గొండ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఓటమి భారంతో కుంగిపోకుండా పట్టువదలని విక్రమార్కుడిలా లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. టీఆర్ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌పై ఆయన గెలుపొందారు. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భువనగిరి ఎంపీగా పనిచేయడం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈ ఎన్నికల్లో సానుకూలాంశంగా మారింది. విజయలక్ష్మీ వరించింది.

బండి సంజయ్‌. హిందూ ఓటు బ్యాంకులో మంచి పట్టున్న నాయకుడు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున కరీంనగర్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసిన బండి సంజయ్‌ భారీ తేడాతో ఓటమి చవిచూశారు. అయినా నిరాశపడకుండా పార్టీ కేడర్‌లో ధైర్యం నూరిపోస్తూ పార్టీ అగ్రనాయకత్వం ఆశీస్సులతో కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కేంద్రం నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు, మోడీ ప్రభుత్వ పథకాలే ప్రచార అస్త్రాలుగా ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారు. స్థానికంగా మంచి పట్టు ఉండటంతో బండి సంజయ్‌ గెలుపు నల్లేరుపైనడకలా మారింది. కరీంనగర్‌ సిట్టింగ్‌ ఎంపీ, టీఆర్ఎస్‌ అభ్యర్థి వినోద్‌కుమార్‌పై సంజయ్‌ విజయం సాధించి కరీంనగర్‌ కోటపై కాషాయ జెండా ఎగురవేశారు.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌గా, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్‌ ఈ లోక్‌సభ ఎన్నికలు నిజంగా ప్రతిష్టాత్మకమే అయ్యాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్‌ అధిష్ఠానం టికెట్ కేటాయించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్లగొండ ఎంపీగా బరిలో దిగారు. టీఆర్ఎస్‌ నుంచి పోటీ చేసిన నరసింహారెడ్డిపై పోటీచేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా గెలిచారు. అంటే ఎమ్మెల్యే నుంచి ఎంపీగా ఆయన ప్రమోట్‌ అయ్యారు.

ఇక కిషన్‌రెడ్డి. భారతీయ జనతా పార్టీ ఫైర్‌ బ్రాండ్‌గా పేరున్న కిషన్‌రెడ్డికి అంబర్‌పేటలో మంచి ఓటు బ్యాంకు ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరిస్థితుల్లో ఓడిపోయిన కిషన్‌రెడ్డి తర్వాత అధిష్టానం ఆశీస్సులతో సికింద్రాబాద్‌ టికెట్‌ దక్కించుకున్నారు. సహజంగా సికింద్రాబాద్‌లో బీజేపీకి మంచి ఓటు బ్యాంకు ఉండటంతో కిషన్‌రెడ్డి గెలుపు నల్లేరుపై నడకే అయింది. అలా ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఆయన్ను ఎంపీ రూపంలో విజయలక్ష్మి వరించడం విశేషం. 

Similar News