రెప్పపాటులో అంతా జరిగిపోయింది. కళ్లముందే రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కేవలం చిన్న నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో నూరేళ్లు జీవించాల్సిన వాళ్లు అర్థాయుష్షుతో జీవితం ముగిస్తున్నారు. బొల్లారంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాలను తీసింది.
మృత్యువు ఎవరిని ఎప్పుడు కబళిస్తుందో తెలీదు. కొన్నిసార్లు చేయని తప్పులకు మృత్యు ఒడిలోకి చేరుతారు. ఎవరో చేసిన పొరపాట్లకు ప్రాణాలే పోతున్నాయి. ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఐడీఏ బొల్లారంలోని గాంధీ చౌరస్తాల ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది.
ఒకవైపు ఆగి ఉన్న ఆటో, మరోవైపు రోడ్డుపై వెళ్తున్న టిప్పర్ ఈ రెండిటి మధ్యలో నుంచి బైక్‌పై ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. సరిగ్గా బైక్ ఆటో దగ్గరికి వచ్చే సరికి ఆటో డ్రైవర్ బైక్‌ను గమనించకుండా డోర్ ఓపెన్ చేశాడు. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న సైదుల్ రెడ్డి, లక్ష్మీ కింద పడిపోయారు. అదే సమయంలో వెనకే వస్తున్న టిప్పర్ ఆ ఇద్దరు వ్యక్తులపై నుంచి దూసుకెళ్లింది. దీంతో సైదులు రెడ్డి అక్కకికక్కడే చనిపోగా, లక్ష్మీ మృత్యువుతో పోరాడుతూ ఆసుపత్రిలో చనిపోయింది.
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సైదులు రెడ్డి జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలోని ఓ ఇండస్ట్రీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈసీఐఎల్‌లో నివశిస్తున్నారు. బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. మృతుల కుటుంబసభ్యులు కన్నీమున్నీరుగా విలపిస్తున్నారు.