తెలుగుదేశం చరిత్రలో కనివిని ఎరుగని పరాజయం. అన్నగారి నుంచి చంద్రన్న వరకూ ఎప్పుడూ చూడని ఓటమి ప్రస్థానం. కనీసం ప్రతిపక్ష హోదా సైతం సాధించలేని శూరత్వం. అమరావతి గల్లీ నుంచి ఢిల్లీ వరకూ హోరెత్తించిన చంద్రబాబుకు ఇంతటి ఘోర పరాజయమేంటి? తెలుగుదేశం ఈస్థాయిలో ఎందుకు ఓడింది? హోదా నుంచి అవిశ్వాసం దాకా విశ్వసనీయత దెబ్బతిందా హామీలు అటకెక్కాయా ఇవేకాదు, టీడీపీ పరాజయానికి పది కారణాలున్నాయి అవెంటో ఒక్కసారి చూద్దామా?
1. మేనిఫెస్టోకు దిక్కులేదు
ఆఖర్లో హామీలకు లెక్కేది?
2014 ఎన్నికలు, చాలా భిన్నమైన పరిస్థితుల్లో జరిగాయి. విభజన సెగలు, రాజధాని లేకపోవడం, కేంద్రంలో మోడీ పవనాలు. దీంతో రాష్ట్రంలో అనుభవజ్ణుడైన చంద్రబాబు రావడమే సరైందని జనం భావించారు. కొత్త రాష్ట్రాన్ని బాబు చేతిలో పెట్టారు. అయితే ఎన్నికల ప్రచారంలో గెలుపే ధ్యేయంగా చంద్రబాబు, అలవికాని హామీలక్కూడా తెరలేపారు. ఇప్పుడు ఇవే కొంపముంచాయి. రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు. కానీ ఆచరణలో సంపూర్ణం కాలేదు. ఇంటికో ఉద్యోగానికి దిక్కులేదు. నిరుద్యోగభృతి రెండు వేలు ఇస్తామని చెప్పి, చివరి ఏడాదిలో వెయ్యితో ప్రారంభించారు. ఇలా 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలు చాలా మటుకు నెరవేరలేదు. వీటినే జగన్, జనంలో గట్టిగా ప్రస్తావించారు. ఇవి జనంలో ఆగ్రహానికి కారణమయ్యాయి. అయితే చివర్లో పసుపు కుంకుమ, రైతుకు పెట్టుబడి, పెన్షన్ల రెట్టింపు వంటి హామీలిచ్చినా, జగన్ ప్రకటించిన తర్వాతే, బాబు కూడా అనౌన్స్ చేయడం బెడిసికొట్టింది. గెలిపిస్తుందనుకున్న పసుపు కుంకుమ ఆదుకోలేదని, వైసీపీ ప్రభంజనాన్ని బట్టి అర్థమవుతోంది. అంటే హామీలు మరిచినా బాబును, మరవకుండా జనం ఓడించారన్నది విశ్లేషకుల మాట.
2. రాజధాని నిర్మాణాన్ని జనం నమ్మలేదా?
అమరావతి నిర్మాణం, అంతర్జాతీయస్థాయిలో కట్టడం, జపాన్, సింగపూర్ మోడల్‌లో క్యాపిటల్, సింగపూర్ బృందం ప్రణాళికలు, ప్రధాని మోడీ శంకుస్థాపనలు, బాహుబలి గ్రాఫిక్స్ లెవల్లో నిర్మాణాలు, ఇలా చెప్పుకుంటూపోతే, అమరావతి నిర్మాణంపై చంద్రబాబు జనంలో విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నగరంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. అయితే ఐదేళ్లలో రాజధాని కనీసం రూపుదాల్చుకోకపోవడం, పునాదుల్లోనే కనిపించడం, జనాలను తీవ్ర నిరాశకు గురి చేసిందనుకోవాలి. దీనికితోడు రాజధాని నిర్మాణానికి ప్రపంచంలో ఎక్కడాలేనివిధంగా 50 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి తీసుకోవడం కూడా అందరికీ ఆమోదయోగ్యంగా అనిపించలేదన్నది విశ్లేషకుల మాట. రాజధానిపై అనవసరమైన హైప్‌లు, చంద్రబాబు పార్టీని ముంచాయని పొలిటికల్ పండితులు చెబుతున్నారు.
3. హోదా యూటర్న్‌పై ప్రజాకోపమా?
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా పదేళ్లు కాదు, 15 ఏళ్లు కావాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మోడీ ఇస్తాడు, సాధించుకుంటామని వకాల్తా పుచ్చుకున్నారు. కానీ మోడీ మాట తప్పారు. బాబు కూడా యూటర్న్ తీసుకుని, ప్యాకేజీకి ఒప్పుకున్నారు. హోదా సంజీవని కాదంటూ జనానికే పాఠాలు చెప్పారు. అదే మాటమీద నిలబడ్డారా అంటే లేదు. అటు ప్రతిపక్ష నాయకుడు హోదాపై తిరుగులేనిపోరాటం చేస్తుండటంతో, మరోసారి యూటర్న్ తీసుకున్నారు. హోదానే కావాలంటూ పాటందుకున్నారు. ఇలా బాబు రకరకాలుగా టర్న్ తీసుకోవడంతో, జనం కూడా కోపంతో యూటర్న్ అయ్యారు.
4. ఎమ్మెల్యేలు, మంత్రులపై మరకలా?
గతంలో సీఎంగా ఉన్నప్పడు చంద్రబాబు తమ ఎమ్మెల్యేలు, మంత్రులను ఆదుపాజ్ణల్లో ఉంచారు. నిరంతర నిఘా పెట్టారు. కానీ మరీ అంత క్రమిశిక్షణ వద్దనుకున్నారేమో కానీ, ఈ టర్మ్ కాస్త జాలీగా వదిలేసినట్టున్నారు బాబు. దీంతో బాబు ఇచ్చిన రిలాక్సేషన్‌ను టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు దుర్వినియోగం చేసుకున్నారని, వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలే నిదర్శమన్నది విశ్లేషకుల మాట. మంత్రులు, ఎమ్మెల్యేలపై ఎక్కడ చూసినా ఇసుక దందాలు, అవినీతి ఆరోపణలే. అధికారులపై దాడి చేసిన ప్రజాప్రతినిధులపై చర్యల్లేవు. అవినీతిపై జనం ఎంతగా రగిలిపోయారో, ఫలితాలే చెబుతున్నాయి. పాపులర్ ఎమ్మెల్యేలు, అనేకమంది మంత్రులు ఘోరంగా ఓడిపోయారు. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రులు, ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇచ్చారు. ఫలితం ఘోర పరాజయం.
5. తొలి ఒంటరి పోటీ పడగొట్టిందా?
చంద్రబాబు మొన్నటి వరకూ ఒంటరిగా పోటీ చేసింది లేదు. చిన్నాచితకా పార్టీలతో ఎన్నికలు ఎదుర్కొన్నారు. కానీ తొలిసారి ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్‌తో పొత్తుంటుందని ఊహాగానాలు వినిపించినా, తెలంగాణ ఫలితంతో వెనక్కితగ్గారు. బహుశా సింగిల్ ఫైట్ బాబుకు అచ్చిరాలేదనడానికి తాజా ఓటమే నిదర్శనమంటున్నారు విశ్లేషకులు.
6. ప్రభుత్వ వ్యతిరేకతతో కొంప కొల్లేరా?
ప్రభుత్వ వ్యతిరేకత ఏ ప్రభుత్వానికైనా పెను సవాలు. అయితే దీన్ని అధిగమించడం కోసం పాలకులు ప్రచారాల పాటందుకుంటారు. పత్రికలు, ఛానెళ్లలో విపరీతంగా ప్రకటనలు ఇచ్చుకుంటారు. కొన్ని కీలకమైన పథకాలను పదేపదే ప్రస్తావిస్తూ సభలు, సమావేశాలు నిర్వహిస్తారు. అయితే, చంద్రబాబు ప్రచారానికి వందల కోట్లు ఖర్చు చేసినా, ప్రజల్లో గూడుకట్టుకున్న ప్రభుత్వ వ్యతిరేకతను తుడిచిపెట్టేయలేకపోయారు.
7. జనం మార్పుకు ఓటేశారా?
జనం మార్పుకు ఓటేశారు. అనుభవజ్ణుడైన చంద్రబాబుకు చాలా అవకాశాలిచ్చాం, 2009 నుంచి పోరాడుతున్న జగన్‌కు ఒక్కసారైనా అవకాశమిద్దామనుకున్నారు ప్రజలు. అందుకే ఒక్క ఛాన్స్ అంటూ పిలుపునిచ్చిన వైసీపీకే, ఛాన్సిచ్చారు. బాబును సైడ్ చేశారు. చాలా రాష్ట్రాల మాదిరే, ఏపీలోనూ జనం జస్ట్ ఫర్ చేంజ్ అన్నారు.
8. మోడీ-కేసీఆర్-జగన్‌లపై ఆరోపణలు నమ్మలేదా?
చంద్రబాబు ఈ ఎన్నికల్లో ప్రభుత్వ సానుకూల విషయాలు పెద్దగా ప్రస్తావించలేదు. మోడీని విలన్ చేశారు. కేసీఆర్ పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, రిటర్న్ గిఫ్ట్ అంటూ బెదిరిస్తున్నారని విమర్శించారు. వీరిద్దరితో జగన్ కుమ్మక్కయ్యారని, ఆంధ్రుల అభిమానాన్ని తాకట్టుపెట్టారని దెప్పిపొడిచారు. సర్కారు పథకాలు, కీలక కార్యక్రమాలేవి ప్రచారం చేయకుండా, వీరినే బూచిగా చూపారు చంద్రబాబు. తెలంగాణలో కేసీఆర్ తనను ఎలా బూచిగా చూపి, ఓట్లు రాబట్టారో, బాబు కూడా అదే ఫార్ములా అప్లై చేయడానికి ప్రయత్నించారు. వ్యక్తిగత దూషణలు చేశారు. జనానికి ఈ మాటలు రుచించలేదని, ఫలితాలను బట్టి అర్థమవుతోంది.
9. జనసేన కొంప ముంచిందా?
అవునన్నా, కాదన్న చంద్రబాబు ఓటమికి దారి తీసిన కారణాల్లో పరోక్షంగా పవన్ కల్యాణ్ ఒకరు. 2014లో బాబు రావాలన్న పవన్, 2019లో బాబు వద్దన్నారు. దీంతో నాడు పవన్ పిలుపుతో టీడీపీకి ఓటేసిన జనం, ఈ ఎన్నికల్లో అవే ఓట్లను లాగేసుకున్నారు. అంటే ప్రభుత్వ సానుకూల ఓటును చీల్చి, బాబు ఓటమికి పరోక్షంగా కారణమయ్యారు పవన్. 2009లో ప్రజారాజ్యంతో అన్నయ్య చిరంజీవి టీడీపీని దెబ్బకొడితే, సరిగ్గా పదేళ్ల తర్వాత తమ్ముడు పవన్ అదే టీడీపీకి ఇన్‌డైరెక్ట్‌గా పోటు పొడిచారు.
10. ఫిరాయింపులకు రెడ్ కార్పెటా?
వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను అదేపనిగా పార్టీలోకి చేర్చుకోవడం, వారిపై అనర్హత వేటు వేయకుండా కాపుకాయడం కూడా జనం గమనించారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొంటున్నాడని ఆరోపించిన చంద్రబాబు, అదేపని ఏపీలో చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఆ అసంతృప్తిని ఓట్ల రూపంలో కుమ్మరించారు. అంతేకాదు, కొందరు ఫిరాయింపుదార్లకు టికెట్లు ఇవ్వడంతో పార్టీని నమ్ముకున్న చాలామంది టీడీపీకి వ్యతిరేకమయ్యారు. టికెట్లు దక్కని మరికొందరు ఫిరాయింపు ప్రజాప్రతినిధులు తిరిగి సొంతగూటికి చేరి, టీడీపీ అభ్యర్థుల ఓటమికి ఊరూవాడా తిరిగారు. అలా బాబు ప్రోత్సహించిన ఫిరాయింపులే చివరికి బెడిసికొట్టాయి. ఇలా తెలుగుదేశం పరాజయానికి పది కారణాలు.