రాంజీ గ్యాంగ్ ఎక్కడ..?

Update: 2019-05-09 14:35 GMT

వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. 58లక్షలు దోపిడీ చేసిన దొంగలు సులభ్ కాంప్లెక్స్‌లో పెట్టెలోని డబ్బులను బ్యాగుల్లోకి మార్చుకున్నారు. తమిళనాడు చేరే వరకు వారు సుమారు 8 వాహనాలు మారినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 20 ప్రత్యేక పోలీసు బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి.

వనస్థలిపురం చోరీ కేసులో కీలక ఆధారం రాచకొండ పోలీసులు సంపాదించారు. 58లక్షల రూపాయలు దోపిడీ చేసిన తర్వాత వనస్థలి పురం నుంచి ఆటోలో ముసరాంభాగ్‌కు చేరుకున్నారు. సులభ్ కాంప్లెక్స్ ముందు 500 రూపాయలు కిందపడేసి సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకుడి దృష్టి మరల్చారు. కిందపడిన డబ్బులు తీసుకునే లోపే సులభ్ కాంప్లెక్స్‌లోకి డబ్బులున్న పెట్టెను తీసుకుని ఇధ్దరు వెళ్లారు. డబ్బులన్ని వెంట తెచ్చుకున్న బ్యాగుల్లోకి మార్చుకుని ఆ పెట్టెను ఇక్కడే వదిలి వేసి వెళ్లారు. సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకుడు పోలీసులకు సమాచారం అందించడంలో వారు వచ్చి పెట్టెను స్వాధీనం చేసుకున్నారు.

దోపిడీ దొంగలు హైదరాబాద్ దాటే వరకు నాలుగు వాహనాలు, తమిళనాడు వరకు 8వాహనాలు మార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎనిమిది మంది దోపిడీ గ్యాంగ్‌లో ఉన్నట్లు నిర్ధారించారు. ఐదుగురు నిందితులు సీన్ ‌లో ఉండగా.. ముగ్గురు దోపిడీకి ప్లాన్ వేశారు. దోపిడీ దొంగలు ఎటువైపు వెళ్లారన్నకోణంలో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. రాంజీనగర్ గ్యాంగే ఈ చోరీ చేసిందని పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. గతంలో ఉన్న ఫొటోలను పరిశీలించినప్పుడు, సీసీ కెమెరాల పుటేజీతో కొన్ని ఆధారాలు దొరికాయి. 20 ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి. రెండు మూడురోజుల్లో నిందితులను పట్టుకుంటామని రాచకొండ పోలీసులు చెబుతున్నారు. 

Similar News