ఎన్ఐఏ దర్యాప్తులో వెలుగుచూస్తున్న సంచలన నిజాలు...2018 లో పేలుళ్లకు భారీ కుట్ర
హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న ఉగ్ర కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఢిల్లీకి చెందిన ఫైజ్ అనే ఐసిస్ ఏజెంట్ అరెస్ట్‌తో మరిన్ని నిజాలు వెల్లడవుతున్నాయి. వచ్చే రెండు మూడు రోజుల్లో మరిన్ని అరెస్టులు ఉంటాయని సంచలన విషయాలు వెలుగుచూస్తాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్‌లో పట్టుబడ్డ ఐసిస్ సానుభూతి పరులపై జాతీయ దర్యాప్తు సంస్థ నిర్వహిస్తున్న దర్యాప్తులో సంచలన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఢిల్లీకి చెందిన ఐసిస్ ఉగ్రవాది మహ్మద్ ఫైజ్ అరెస్టుతో కదిలిన తీగ రాష్ట్రాల రాజధానుల్లో పేలుళ్లకు సంబంధించిన డొంక దొరికింది. ముఖ్యంగా శ్రీలంక తరహా దాడులను మనదేశంలో కూడా అమలు పర్చేలా వ్యూహం పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఫైజ్ ఇచ్చిన సమాచారంతోనే ఇటీవల హైదరాబాద్‌లో ఐసిస్ సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. జుంద్ ఉల్ ఖలీఫా ఆల్ హింద్ ఫీ బిలాల్ అనే ఐసిస్ అనుబంధ ఉగ్రవాద సంస్థతో చేతులు కలిపిన ఫైజ్ హైదరాబాద్‌లో యువతను ఆకర్షించి టెర్రరిజం వైపు మళ్లించేవాడు. ఇందుకు కావాల్సిన డబ్బులు, పేలుడు పదార్థాలు, ఆయుధాలన్నీ అతనే సమకూర్చేవాడు. 2018 లోనే వీరంతా దేశంలో పెద్దఎత్తున పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.
గతంలో సిరియా వెళ్లి ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న బాసిత్ అనే యువకుడిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ అతని నుంచి కీలక ఆధారాలు సేకరించింది. బాసిత్‌తో పాటు ఐసిస్ సానుభూతి పరులైన అతని స్నేహితులను కూడా అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ వారి నుంచి ఉగ్రకార్యకలాపాలపై సమాచారాన్ని సేకరించింది. వీరితో పాటు గతేడాది అరెస్ట్ అయిన జీషాన్, మసూద్ తోహాజ్, షిబ్లీ బిలాల్‌తో పాటు బాసిత్ రెండో భార్య మోనును కూడా అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. దీంతో ఐసిస్ సానుభూతి పరులకు అడ్డాగా మారిన హైదరాబాద్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే రెండు రోజుల్లో మరికొందరిని కూడా అరెస్ట్ చేసి సంచలనాత్మకమైన విషయాలను వెల్లడించేందుకు ఎన్‌ఐఏ సిద్ధంగా ఉంది.